బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సూర్యలంక బీచ్‌ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. మంగళవారం సూర్యలంక బీచ్ లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ, ఏపీటీడీసీ చైర్మన్ నూకసాని బాలాజీ, జిల్లా కలెక్టర్ వినోద్, ఎస్పీ ఉమామహేశ్వరరావు మరియు పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు.
అనంతరం పలు అభివృద్ధి పనులకు మంత్రులు కందుల దుర్గేష్, అనగాని సత్య ప్రసాద్ లు భూమి పూజ చేశారు. సూర్యలంక బీచ్ కు బే ఆప్ బాపట్ల పేరుతో బ్రాండింగ్ ప్రారంభించారు.కుటుంబంతో సరదాగా బీచ్ లో గడిపేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించడంతో పాటు ఫెస్టివల్ కార్నివాల్ నిర్వహిస్తామని ప్రకటించారు.
సమీక్ష అనంతరం బ్లూ వేవ్ అడ్వెంచరస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెట్ స్కీ రైడ్స్ ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వలం సమీక్షలకే పరిమితం కాకుండా, పర్యాటకులకు కలిగే ‘థ్రిల్’ ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించేందుకు మంత్రి కందుల దుర్గేష్ సాగర అలలపై జెట్ స్కీ రైడ్ చేశారు. సాహస క్రీడలకు సూర్యలంక కేరాఫ్ అడ్రస్‌గా మారుతోందని ఆయన ఈ సందర్భంగా నిరూపించారు.
సూర్యలంక సముద్ర తీరం ఇప్పుడు కేవలం అందానికే కాదు.. అడ్వెంచర్ కు కూడా పెట్టింది పేరు అని అన్నారు..పర్యాటకులారా ఇంకెందుకు ఆలస్యం .. మీరు కూడా రండి.. అలలపై ఆడుకుందాం!అంటూ చమత్కరించారు.వాటర్ స్పోర్ట్స్ ద్వారా అలలపై ప్రయాణం అద్భుతమైన థ్రిల్ కు గురి చేస్తుందని మంత్రి దుర్గేష్ అన్నారు. సమీక్ష అనంతరం కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద మంజూరైన రూ. 97.52 కోట్ల నిధులతో సూర్యలంక బీచ్ లో చేపడుతున్న వివిధ పనులను మంత్రి దుర్గేష్ క్షుణ్ణంగా పరిశీలించారు.
2019-24 లో గత ప్రభుత్వం అనేక రంగాలతో పాటు పర్యాటక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసిందని మంత్రి దుర్గేష్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయని, అదే స్థాయిలో పర్యాటకాభివృద్ధి జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారని ఈ క్రమంలో అకుంఠిత దీక్షతో వారు పనిచేస్తున్నట్లు మంత్రి దుర్గేష్ వివరించారు.
రెవెన్యూ మంత్రి అనగాని సత్య ప్రసాద్ భూ సమస్యల పరిష్కారంపై, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జిల్లా పర్యాటక అభివృద్ధిపై చేస్తున్న కృషిని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ కొనియాడారు.ఏపీటీడీసీ ఛైర్మన్ నూకసాని బాలాజీ పర్యాటక రంగ అభివృద్ధే లక్ష్యంగా ఫ్యాషన్ తో పని చేస్తున్నారని కొనియాడారు. పర్యాటక రంగంలో బాపట్లను అగ్రశ్రేణి జిల్లాగా మార్చాలన్న సంకల్పంతో జిల్లా కలెక్టర్ వినోద్ కృషి చేస్తున్నారన్నారు. 2029 నాటికి ఏపీని ప్రపంచ పర్యాటక హబ్‌గా మార్చాలన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ల ఆశయాలకు అనుగుణంగా ప్రతి అధికారి, కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.





