అసెంబ్లీలో ఉదయనిధి దుమారం

Must read

తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా తమిళనాడు అసెంబ్లీ వేదికగా డీఎంకే నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలీన్​ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి, నటుడు జోసెఫ్​ విజయ్​ పై మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభలో ఆసక్తిని రేకెత్తించాయి.

తాను, సీఎం విజయ్ ఇద్దరం చెన్నైలోని లయోలా కాలేజ్​ లోనే చదువుకున్నామని గుర్తు చేసిన ఉదయనిధి.. రాజకీయాలు, పరిపాలన విషయానికి వస్తే డీఎంకే పార్టీకి దశాబ్దాల అనుభవం ఉందని పేర్కొన్నారు.

అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ చిరునవ్వుతో మాట్లాడుతూ, “సీఎం విజయ్ నా కాలేజీ సీనియర్” అని అన్నారు. దీంతో సభలో కొంతసేపు నవ్వులు వినిపించాయి. అయితే వెంటనే ఆయన రాజకీయ వ్యాఖ్యలకు మళ్లారు. “కాలేజీలో ఆయన సీనియర్ కావచ్చు. కానీ పరిపాలనలో, రాజకీయ అనుభవంలో డీఎంకే పార్టీ చాలా సీనియర్” అని ఉదయనిధి వ్యాఖ్యానించారు.

“1967లోనే మా పార్టీ తమిళనాడులో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఎన్నో దశాబ్దాల అనుభవం మాకు ఉంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన, అభివృద్ధి విషయంలో డీఎంకేకు విస్తృత అనుభవం ఉంది” అని ఆయన అన్నారు. ఈ అనుభవాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

రాజకీయ విభేదాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని ఉదయనిధి స్పష్టం చేశారు. “మాకున్న అనుభవం, పరిజ్ఞానం సీఎం విజయ్ ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. రాష్ట్ర సంక్షేమం కోసం అవసరమైతే మా సలహాలు, సూచనలు ఇవ్వడానికి మేం సిద్ధంగా ఉన్నాం. సీఎం విజయ్ కూడా వాటిని స్వీకరించాలి” అని ఆయన సూచించారు.

ఉదయనిధి చేసిన వ్యాఖ్యలను కొందరు “సానుకూల రాజకీయ సంకేతం”గా చూస్తుండగా, మరికొందరు “డీఎంకే రాజకీయ అనుభవాన్ని గుర్తుచేసే ప్రయత్నం”గా విశ్లేషిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్

ఉదయనిధి స్టాలిన్ చేసిన “విజయ్ నా కాలేజీ సీనియర్” వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు, రాజకీయ కార్యకర్తలు ఈ వీడియో క్లిప్‌ను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు “ఇది హెల్తీ పాలిటిక్స్‌కు ఉదాహరణ” అంటుండగా, మరికొందరు “ఇందులో రాజకీయ వ్యూహం కూడా ఉంది” అని కామెంట్లు చేస్తున్నారు.
విజయ్ ప్రభుత్వంపై అందరి దృష్టి

ఉదయనిధి వ్యాఖ్యల్లో రాజకీయ విమర్శ కంటే “రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం” అనే సందేశం ఎక్కువగా కనిపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం అనుభవాన్ని పంచుకోవడానికి సిద్ధమని డీఎంకే ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!