తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూటమికి అనూహ్యంగా అన్నాడీఎంకేలోని ఒక వర్గం మద్దతు ప్రకటించింది. సీనియర్ నేత సీవీ షణ్ముగం నేతృత్వంలోని ఈ వర్గం మంగళవారం అధికారికంగా తమ నిర్ణయాన్ని వెల్లడించడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.
ఇప్పటికే భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన విజయ్ ప్రభుత్వం ఈ పరిణామంతో మరింత బలోపేతమవుతుందని. అన్నాడీఎంకేలో పెరుగుతున్న అంతర్గత విభేదాలు, వరుస ఎన్నికల పరాజయాలు ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సీవీ షణ్ముగం గత పదేళ్లుగా అన్నాడీఎంకే వరుసగా ఎదుర్కొంటున్న రాజకీయ పరాజయాలు పార్టీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపాయన్నారు. దశాబ్దాలుగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న డీఎంకే చేతిలో వరుసగా మూడుసార్లు ఓటమి చవిచూడటమే కాకుండా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ పార్టీ టీవీకే చేతిలో కూడా ఓడిపోవడం పార్టీ స్థితిని మరింత బలహీనపరిచిందని పేర్కొన్నారు.
“పార్టీని మళ్లీ పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉంది. పార్టీ భవిష్యత్తు గురించి సీరియస్‌గా ఆలోచించాల్సిన సమయం వచ్చింది” అని షణ్ముగం వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమిళనాడులో ప్రజల్లో మార్పు కోసం ఆసక్తి పెరిగిందని, ఆ మార్పుకు టీవీకే వేదికగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు.
టీవీకే అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) ముందుకు తెచ్చినట్లు షణ్ముగం వెల్లడించడం. అయితే ఆ ప్రతిపాదనను తాము తీవ్రంగా వ్యతిరేకించామని స్పష్టం చేశారు.
“డీఎంకేకు వ్యతిరేకంగా ఎన్నో సంవత్సరాలు రాజకీయ పోరాటం చేసిన పార్టీగా అన్నాడీఎంకే ఉంది. అలాంటి పరిస్థితిలో అదే డీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకోవడం పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధం” అని షణ్ముగం వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే తాము టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
త్వరలోనే ముఖ్యమంత్రి విజయ్‌తో భేటీ కానున్నట్లు షణ్ముగం ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో భవిష్యత్ రాజకీయ వ్యూహాలు, పాలనలో సహకారం, ప్రాంతీయ అభివృద్ధి అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అన్నాడీఎంకేలో అంతర్గత అసంతృప్తి మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. షణ్ముగం వర్గం నిర్ణయం తర్వాత మరికొందరు నేతలు కూడా టీవీకే వైపు మొగ్గు చూపే అవకాశముందనే ప్రచారం సాగుతోంది. అదే జరిగితే తమిళనాడులో ప్రతిపక్ష రాజకీయాలు పూర్తిగా మారిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు.
డీఎంకే కూడా ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ ప్రభుత్వానికి వస్తున్న మద్దతు భవిష్యత్ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశముందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.





