వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ధ్వంసం చేసిన 800 ఏళ్ల చరిత్ర గల కాకతీయుల నాటి మట్టికోట శివాలయాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గారు సందర్శించారు. కూల్చివేతకు గురైన ఆలయ ప్రాంగణంలో స్థానికులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటనలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, శంకర్ నాయక్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. శివాలయ సందర్శన అనంతరం హరీశ్ రావు గారు మీడియాతో మాట్లాడారు.
మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో బడులు ఆగమే కాదు.. ఏకంగా గుడుల విధ్వంసం కూడా జరుగుతున్నాయన్నారు. ఆనాడు కేసీఆర్ మన ఊరు-మన బడి పెడితే రేవంత్ రెడ్డి దాన్ని అర్ధాంతరంగా నిలిపేశారు. రేవంత్ రెడ్డి పుణ్యమా అని ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దేవుళ్ల మీద ఒట్లు పెట్టి వంద శాతం రుణమాఫీ చేయకుండా మాట తప్పిన భారతదేశ తొలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయనకు దేవుడంటే భయం లేదు, భక్తీ లేదన్నారు.
కేసీఆర్ యాదాద్రి లాంటి మహా పుణ్యక్షేత్రాలను నిర్మిస్తే, రేవంత్ రెడ్డి మాత్రం హైడ్రా పేరుతో పేదల ఇండ్లు, మసీదులు, చర్చీలు, ఇప్పుడు ఏకంగా గుడులు కూలగొడుతున్నాడు. విశాఖ పీఠం కూలుస్తా అని మొన్న అధికారులను పంపాడని ఆరోపించారు. సీఎం అయిన కొత్తలో సెక్రటేరియట్ కు పోతే లంక బిందెలు దొరుకుతాయనుకున్నా అని రేవంత్ రెడ్డి అన్నారని గుర్తుచేశారు.
ఆయన అనుయాయులతో కలిసి నిజాం భవనాల చుట్టూ గుప్త నిధుల కోసం బాగానే వెతికాడు. అక్కడ దొరకకపోయే సరికి ఇప్పుడు కాకతీయుల గుడుల మీద పడ్డాడని. అశోక్ నగర్ లో కాకతీయ గణపతి దేవుడు నిర్మించిన 800 ఏళ్ల నాటి అద్భుతమైన శివాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని ఆయన ఆరోపించారు.
స్కూల్ కట్టే పనైతే పగలు చేయొచ్చు కదా? అర్ధరాత్రి ఎందుకు తవ్వారు? గుప్త నిధుల వేటలో రేవంత్ రెడ్డి డైరెక్షన్ లోనే ఈ కుట్ర జరిగిందని, పురావస్తు శాఖ జిల్లా అధికారి బుజ్జి ఈ నెల 7వ తేదీన కలెక్టర్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. ఆర్కియాలజీ అధికారి కంప్లైంట్ ఇచ్చినా ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, మిషనరీ సీజ్ చేయలేదు, ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
యుద్ధప్రాతిపదికన ఈ చారిత్రక శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. 1958 చట్టం ప్రకారం వందేళ్లు దాటిన కట్టడాలు ఆర్కియాలజీ పరిధిలోకి వస్తాయి కాబట్టి, ఈ స్థలాన్ని తక్షణమే పురావస్తు శాఖకు అప్పగించాలి. అర్ధరాత్రి తవ్వకాల్లో బయటపడ్డ గుప్త నిధులు, లంక బిందెలు ఏ ప్రభుత్వ పెద్దల ఇళ్లకు పోయాయో సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. అవి నీ మనుషులా? నా మనుషులా? అన్నది కాదు. అది రాష్ట్ర ప్రజల చెమట చుక్కల ఆదాయమన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5% కి మించి ఎక్సెస్ టెండర్లు ఇవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి, వెంటనే ఈ ప్రజాధనం లూటీని ఆపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.





