తమిళనాడు ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విజయ సోమవారం ఎమ్మెల్యేగా కూడా అధికారికంగా ప్రమాణం చేశారు. కొత్తగా ఏర్పాటైన 17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది. ప్రొటెం స్పీకర్ కరుప్పియా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేతగా ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన విజయ్, ఇప్పుడు ముఖ్యమంత్రిగా మరియు ఎమ్మెల్యేగా అధికారిక బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆయన ప్రమాణ స్వీకారంలో అనుసరించిన రెండు విభిన్న విధానాలు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో విజయ్ “ఆండవన్ మీదు ఆనైయగ” అంటూ దేవుడిపై ప్రమాణం చేశారు. కానీ సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో మాత్రం “ఉలమార ఉరుది కూరుగిరేన్” అంటూ మనస్సాక్షిగా ధ్రువీకరిస్తున్నానని రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేశారు.
ఈ రెండు భిన్నమైన ప్రమాణ పద్ధతులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొందరు దీన్ని విజయ్ వ్యక్తిగత విశ్వాసం, రాజ్యాంగబద్ధ బాధ్యతల మధ్య సమతుల్యతగా అభివర్ణిస్తుండగా, మరికొందరు రాజకీయ కోణంలో విశ్లేషిస్తున్నారు.
ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ స్థానాల్లో ఆయన గెలుపొందారు. అయితే రెండు స్థానాలను కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. దీంతో తిరుచి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు.
తిరుచి ఈస్ట్ నియోజకవర్గానికి త్వరలో ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఉప ఎన్నికపై ఇప్పటికే తమిళ రాజకీయాల్లో చర్చ మొదలైంది. టీవీకే ఈ స్థానాన్ని కూడా నిలబెట్టుకోవాలని వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీలో విజయ్ ప్రమాణం చేసిన వెంటనే టీవీకే సీనియర్ నేతలు ఎన్. ఆనంద్, ఆధావ్ అర్జున్ కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. టి.నగర్ నుంచి గెలిచిన ఎన్. ఆనంద్, విల్లివాక్కం ఎమ్మెల్యే ఆధవ్ అర్జున సభలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
తొలిసారి అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీ సభ్యులు అసెంబ్లీలో ఎంతో ఉత్సాహంగా కనిపించారు. పార్టీ కార్యకర్తలు కూడా ఈ ఘట్టాన్ని చారిత్రాత్మకంగా అభివర్ణిస్తున్నారు. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా ప్రజల్లో భారీ ఆదరణ పొందుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. కొత్త ప్రభుత్వం, కొత్త రాజకీయ సమీకరణాల నేపథ్యంలో సభా కార్యకలాపాలపై దేశవ్యాప్తంగా దృష్టి నెలకొంది. విజయ్ రాజకీయ ప్రస్థానం మొదటి అడుగులోనే ముఖ్యమంత్రి పదవిని అందుకోవడం తమిళనాడు రాజకీయ చరిత్రలో అరుదైన సంఘటనగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారంతో ఆయన అధికారిక రాజకీయ ప్రయాణం కొత్త దశలోకి ప్రవేశించినట్లైంది.





