అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమి సాధించిన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ విజయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసానికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు.
సోమవారం విడుదల చేసిన ప్రకటనలో చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ఎన్నికల ఫలితాలు మోదీ దార్శనికతకు, ఆయన నాయకత్వంలో దేశం అభివృద్ధి దిశగా సాగుతున్న తీరుకు అద్దం పడుతున్నాయని అన్నారు. ఎన్డీయే సాధించిన ఈ విజయం ‘వికసిత భారత్’ లక్ష్య సాధన ప్రయాణానికి మరింత బలం చేకూర్చిందని ఆయన పేర్కొన్నారు.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ అనే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని చంద్రబాబు తెలిపారు. ఈ సూత్రాలకు అనుగుణంగా అమలు అవుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు స్పష్టమైన మద్దతు తెలియజేశారని ఆయన అన్నారు.
అభివృద్ధి పట్ల ఎన్డీయే ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రజలు గుర్తించి తీర్పు ఇచ్చారని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి చెందిన శక్తిగా మార్చాలనే సంకల్పానికి ఈ ఎన్నికల ఫలితాలు మరింత ఊపు తీసుకొచ్చాయని తెలిపారు.
ఈ విజయాన్ని కేవలం రాజకీయ విజయం మాత్రమే కాకుండా యావత్ దేశ ప్రజల విజయంగా చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు అభివృద్ధి, స్థిరత్వం, మరియు సమర్థ పాలనకు ఇచ్చిన మద్దతు భారత ప్రజాస్వామ్యంలో విశేషమైన సంకేతంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.





