కార్మికుల కోసం ‘లేబర్ అడ్డా’

Must read

రాష్ట్రంలోని కార్మిక లోకానికి మహర్దశ పట్టించేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటనలు చేశారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో నిర్వహించిన ‘పేదల సేవ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కార్మికుల సంక్షేమం, నైపుణ్యాభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్పష్టం చేశారు.

కేవలం కూలీలుగానే కాకుండా, కార్మికులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్నదే తన ఆకాంక్ష అని వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా అత్యాధునిక ‘లేబర్ అడ్డా’ల నిర్మాణంతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కార్మికుల పిల్లలు భవిష్యత్తులో పరిశ్రమలు స్థాపించే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యాధునిక పనిముట్లను తెప్పించి, లేబర్ అడ్డాలను కేవలం నిరీక్షణ కేంద్రాలుగా కాకుండా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు.

తొలిదశలో రాష్ట్రంలోని 15 ప్రధాన నగరాల్లో ఈ లేబర్ అడ్డాలను ప్రయోగాత్మకంగా నిర్మిస్తామని, అక్కడ కార్మికులకు ఆధునిక పరికరాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు. వివిధ ప్రభుత్వ శాఖలను ‘నైపుణ్యం పోర్టల్’తో అనుసంధానించడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు.

రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం అన్నారు. రాజధాని అమరావతిలో భారీ ఈఎస్‌ఐ ఆసుపత్రిని నిర్మించడంతో పాటు అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, తిరుపతి ప్రాంతాల్లో కూడా కొత్త ఈఎస్‌ఐ ఆసుపత్రులను అందుబాటులోకి తెస్తామన్నారు. మహిళా సాధికారతపై మాట్లాడుతూ.. చట్టసభల్లో ఆడబిడ్డలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు. మహిళలు చట్టసభల్లో ఉంటేనే ఆ సభలకు నిజమైన గౌరవం లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

కృష్ణా జిల్లా భవిష్యత్తును మార్చే దిశగా బందర్ పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేశామని సీఎం తెలిపారు. ఇప్పటికే 57 శాతం పనులు పూర్తయ్యాయని, డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు.

భారత్ మాలా ప్రాజెక్టులో భాగంగా మచిలీపట్నం బైపాస్ రోడ్డును 6 వరుసలుగా అభివృద్ధి చేస్తున్నామని, హైదరాబాద్ – మచిలీపట్నం హైవేను ఎక్స్‌ప్రెస్ రోడ్డుగా తీర్చిదిద్దుతామని వివరించారు. కృష్ణా పుష్కరాల నాటికి జిల్లాలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని రైతులకు భరోసా ఇచ్చారు.

ఇక నుంచి ప్రతీ సమావేశంలోనూ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల నుంచి సమాచారం అడుగుతామని సీఎం అన్నారు. టీమ్ లీడర్ గా ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తేనే మొత్తంగా ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, ఎంపీ బాలశౌరి తదితరులు హాజరయ్యారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!