నగర శివార్లలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఖరీదైన సిబెరియన్ హస్కి జాతికి చెందిన 30 నుంచి 40 శునకాలను గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డుపై వదిలివెళ్లడం తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. తీవ్రమైన ఎండ వేడిమిని తట్టుకోలేక, ఆహారం, నీరు లేక అవి తీవ్ర అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటనలో ఒక శునకం ప్రాణాలు కోల్పోయింది.
పటాన్చెరు-శంకర్పల్లి మార్గంలో ఏప్రిల్ 21న ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక కంటైనర్‌లో ఈ శునకాలను తీసుకువచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు, వాటిని అక్కడే వదిలివెళ్లినట్లు తెలుస్తోంది. చల్లని వాతావరణాన్ని ఇష్టపడే హస్కీ జాతి కుక్కలు, తెలంగాణలోని తీవ్రమైన ఎండలకు తట్టుకోలేక నీరసించిపోయాయి.
ఈ కుక్కల రూపం నక్కలను పోలి ఉండటంతో, స్థానికులు మొదట అవి అడవి జంతువులేనేమోనని భావించి దగ్గరికి వెళ్లేందుకు భయపడ్డారు. అయితే అవి పెంపుడు జంతువులని తర్వాత గుర్తించారు. అప్పటికే కొన్ని శునకాలు దాహం, ఆకలితో బలహీన స్థితికి చేరుకున్నాయి.
ఈ విషయాన్ని గమనించిన సమీపంలోని ఒక దుకాణదారుడు వెంటనే అసరా ఫౌండేషన్ సభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే వలంటీర్లు ఘటన స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. అయితే వారు చేరుకునేలోపే కొన్ని కుక్కలు ఎండ నుంచి తప్పించుకోవడానికి సమీప అడవిలోకి పరుగులు తీశాయి. మరికొన్నింటిని దారిలో వెళ్తున్న వాహనదారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
ఘటన స్థలంలో తీవ్ర అస్వస్థతతో పడి ఉన్న 8 శునకాలను వలంటీర్లు రక్షించి, వెంటనే వైద్య సహాయం అందించారు. అనంతరం వాటిని SWAN NGO సంరక్షణ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వాటి ఆరోగ్యం నిలకడగా ఉందని నిర్వాహకులు తెలిపారు.
ఈ ఘటనపై జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖరీదైన జాతి కుక్కలను ఇలా నిర్లక్ష్యంగా వదిలివేయడం ఎంతటి అమానుషమని ప్రశ్నిస్తున్నారు. పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ, కొందరు వాటిని కేవలం ఫ్యాషన్‌గా తీసుకుని తర్వాత వదిలివేస్తున్నారని విమర్శిస్తున్నారు.





