మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించిన ఎ.జి. పేరరివాళన్ ఇప్పుడు న్యాయవాదిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తమిళనాడు-పుదుచ్చేరి బార్ అసోసియేషన్‌లో తన పేరు నమోదు చేసుకుని అధికారికంగా అడ్వకేట్‌గా మారారు.
దాదాపు 31 ఏళ్లపాటు జైలు జీవితం గడిపిన ఆయన, 2022లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విడుదలయ్యారు. విడుదల అనంతరం తన విద్యను కొనసాగిస్తూ, బెంగళూరులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లా కాలేజీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత 2025లో నిర్వహించిన ఆల్ ఇండియా బార్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. త్వరలోనే మద్రాస్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పేరరివాళన్, జైళ్లలో సరైన న్యాయ సహాయం లేక మగ్గిపోతున్న వేలాది మంది ఖైదీల కోసం పని చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు. ముఖ్యంగా నిరుపేద జీవిత ఖైదీలకు న్యాయం అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
గతానికి వస్తే, 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న రాజీవ్ గాంధీపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన మృతి చెందారు. ఈ కేసులో బాంబు తయారీకి అవసరమైన రెండు బ్యాటరీలను కొనుగోలు చేసి అందించారనే ఆరోపణలతో 19 ఏళ్ల వయసులోనే పేరరివాళన్ అరెస్టయ్యారు.
ఈ కేసులో 1998లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. అనంతరం 2014లో సుప్రీంకోర్టు ఈ శిక్షను జీవిత ఖైదుగా మార్చింది. తరువాత క్షమాభిక్ష ప్రక్రియలో భాగంగా రాష్ట్ర గవర్నర్ అనుమతితో ఆయన విడుదలకు మార్గం సుగమమైంది. చివరికి సుప్రీంకోర్టు ఉత్తర్వులతో 2022లో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.
జైలు జీవితం అనంతరం విద్యాభ్యాసం పూర్తి చేసి న్యాయవాదిగా మారడం పేరరివాళన్ జీవితంలో కీలక మలుపుగా భావిస్తున్నారు. సమాజంలో న్యాయం అందని వర్గాలకు సహాయం చేయాలనే సంకల్పంతో ఆయన ముందుకు సాగుతున్నారు.





