హైదరాబాద్ నగరంలోని రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి అంశంపై కేంద్ర మంత్రి జి. క్రిష్ణ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తన లేఖలో కిషన్ రెడ్డి, ఈ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. “ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా చొరవ తీసుకుని పనులను పూర్తి చేయాలి” అని స్పష్టం చేశారు.
హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా, ప్రయాణికుల రాకపోకల కారణంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచీగూడ రైల్వేస్టేషన్, హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్ వంటి ప్రధాన రైల్వే టెర్మినళ్లపై తీవ్ర భారం పడుతోందని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారంగా చర్లపల్లి వద్ద ఆధునిక టెర్మినల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
రూ.430 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చర్లపల్లి టెర్మినల్‌ను గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ టెర్మినల్ నుంచి పలు రైళ్లు సేవలు అందిస్తున్నాయని, ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెప్పారు.
స్టేషన్‌కు సంబంధించిన బాహ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి లేకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ప్రయోజనం అందడం లేదని కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యంగా అప్రోచ్ రోడ్ల విస్తరణ అత్యవసరమని, ప్రయాణికుల రాకపోకలు సౌకర్యవంతంగా ఉండాలంటే ఈ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
స్టేషన్‌కు ఇరువైపులా పార్కింగ్ సదుపాయాలు, ఇతర అవసరాల కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయితే నగర రైల్వే రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పు వస్తుందని అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తే మాత్రమే ఈ ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని ఆయన తెలిపారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ లేఖపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి నగర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో, ఈ అంశంపై త్వరలోనే నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది.





