భగీరథ మహర్షీ స్ఫూర్తితో రాష్ట్రంలో జల సంరక్షణను ఉద్యమంగా చేపట్టామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. అపర భగీరథుడు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఇప్పటికే భారీ ఎత్తున సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారన్నారు. ఏపీకి గుండెకాయ లాంటి పోలవరం నిర్మాణం పూర్తయితే రాష్ట్ర రూపు రేఖలే మారిపోతాయని అన్నారు.
భగీరథ మహర్షి జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి మంత్రి సవిత పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దివి నుంచి భువికి గంగను తీసుకొచ్చిన భగీరథ మహర్షి మహనీయుడని కొనియాడారు. గంగను భూమికి తీసుకురావడానికి ఆయన కఠోర తపస్సు చేశాడన్నారు. సగరుల కుల దైవమైన భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.
సమాజ అభ్యున్నతికి, ప్రజల సంక్షేమానికి భగీరథ మహర్షి చేసిన కృషి అపారమని మంత్రి అభిప్రాయపడ్డారు. సగరుల కులదైవంగా పూజలు అందుకుంటున్న భగీరథ మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ద్వారా ఆయన ఆలోచనలను, విలువలను ప్రజల్లో వ్యాప్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
పట్టుదలకు మూలపురుషుడైన భగీరథుని స్ఫూర్తితో సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రంలో జల సంరక్షణకు పెద్ద ఉద్యమమే చేస్తున్నారన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పోలవరం సహా కీలకమైన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కృషి చేస్తున్నారన్నారు. రాయలసీమలో సాగునీటి కల్పనకు 2014-19 మధ్య కాలంలో రూ.12,441 కోట్లు వెచ్చించారన్నారు.
రాష్ట్రానికి గుండెకాయగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ లభిస్తుందని మంత్రి సవిత అన్నారు. పోలవరం ద్వారా సాగునీటి విస్తీర్ణం పెరగడంతో పాటు తాగునీటి సమస్యలు కూడా గణనీయంగా తగ్గుతాయని ఆమె తెలిపారు. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి, పరిశ్రమల అభివృద్ధి వంటి రంగాల్లో కూడా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరవాత రూ.6,613 కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. రూ.3,870 కోట్లు వెచ్చించి హంద్రీనీవా ద్వారా కృష్ణా జలాలను మడకశిరకు, కుప్పానికి తరలించామన్నారు. వచ్చే ఖరీఫ్ నాటికి సాకుకు పూర్తిస్థాయి సాగునీరు అందించడంతో పాటు తాగునీటి కల్పనకు జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. నీటితోనే అభివృద్ధి అని సీఎం చంద్రబాబు నమ్మిన సిద్దాంతమని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు నందు అబద్ధయ్య వీరంకి వెంకట గురుమూర్తి, మల్లె ఈశ్వరరావు, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





