కేసీఆర్ తన కళ్లతో బీఆర్ఎస్ అంతమవడం చూడాలని కోరుకుంటున్నాం :ఎంపీ అర్వింద్​

Must read

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం కొనసాగుతుంది. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన కళ్లతోనే బీఆర్ఎస్ పార్టీ అంతమవడం చూడాలని తాము కోరుకుంటున్నామని, అది కూడా త్వరలోనే జరుగుతుందని తాము నమ్ముతున్నామన్నారు.

ఈ సందర్బంగా అర్వింద్ మాట్లాడుతూ, కేసీఆర్‌ను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్న వారు బయటివారు కాదని, ఆయన కుటుంబ సభ్యులే ఎక్కువగా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా కేటీఆర్, కవిత, హరీశ్ రావు పేర్లు ప్రస్తావిస్తూ, వీరే కేసీఆర్‌ను రాజకీయంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. కవిత, కేటీఆర్‌లకు విమాన టిక్కెట్లు ఇచ్చి పంపిస్తే కేసీఆర్‌తో పాటు తెలంగాణలోని సమస్యలు కూడా తగ్గిపోతాయని అన్నారు.

ఇక రాష్ట్రంలోని రైతుల సమస్యలపై కూడా అర్వింద్ స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాల్లో అస్తవ్యస్థ పరిస్థితులు నెలకొన్నాయని, రైతులు తమ పంటలను విక్రయించడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

రైతుల సమస్యలను పట్టించుకునే పరిస్థితి రాష్ట్రంలో లేదని అర్వింద్ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు సరైన ధరలు లభించడం లేదని, మద్దతు ధరల విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానం పాటించడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో రైతుల కోసం తాను కట్టుబడి ఉన్నానని ఆయన పేర్కొన్నారు.

పసుపు రైతులకు ఆయన కీలక హామీ ఇచ్చారు. తాను రాజకీయాల నుంచి తప్పుకునేలోపు పసుపు పంటకు క్వింటాల్‌కు రూ.30 వేల మద్దతు ధర సాధించి తీరుతానని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని, వారి కోసం అవసరమైన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకడుగు వేయబోనని తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!