ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు ఇటీవల శస్త్రచికిత్స జరగడంతో రాజకీయ, సినీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. వైద్యులు చేసిన ప్రకటన ప్రకారం ఆయన ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, కోలుకునే దిశగా ఉన్నారని సమాచారం.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, పవన్ కల్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. “పవన్ కల్యాణ్ శస్త్రచికిత్స అనంతరం త్వరగా ఆరోగ్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన త్వరగా శక్తిని పుంజుకుని, మునుపటి కంటే మరింత ఉత్సాహంతో తిరిగి రావాలని ఆశిస్తున్నాను” అని తెలిపారు. అలాగే ఆయన త్వరలోనే విధుల్లోకి చేరుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై అభిమానులు, పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో, జనసేన వర్గాలు సానుకూల సమాచారం అందించాయి. శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తైందని, ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారని వెల్లడించారు.
జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కూడా స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. “మన ప్రియతమ నాయకుడు పవన్ కల్యాణ్‌కు వైద్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఆయన క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా కోలుకుంటున్నారు. కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన మరింత శక్తితో తిరిగి ప్రజాసేవలోకి వస్తారు” అని ఆయన తమ్ముడిని ఆరోగ్యం విషయాలను పంచుకున్నారు.
నాగబాబు మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ దృఢ సంకల్పం, పట్టుదల ఎప్పుడూ అందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు. “ఆయన ఆరోగ్యం మా అందరికీ అత్యంత ముఖ్యమైనది. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు” అని తెలిపారు.
పవన్ కల్యాణ్ రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, ప్రజల్లో విశేష ఆదరణ పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన ఆరోగ్యం గురించి వచ్చిన వార్తలతో అభిమానులు, అనుచరులు ఆందోళన చెందారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలిసి అందరూ ఊపిరిపీల్చుకున్నారు.





