కర్నూలు జిల్లాలోని మంత్రాలయం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ విషాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీవిచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) ద్వారా ఆర్థిక సాయం ప్రకటించారు.
ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యలయ అధికారులు వెల్లడించారు. ఈ సహాయం బాధిత కుటుంబాలకు కొంతమేర ఉపశమనం కలిగించేందుకు ఉద్దేశించబడినట్లు అధికారులు తెలిపారు.
కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు నుంచి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దర్శనానికి యాత్రికులు బొలెరో వాహనంలో ప్రయాణిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో చేరుకున్నారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ట్యాంకర్ వాహనం బోలెరోను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఢీకొట్టిన తీవ్రతకు బొలెరో వాహనం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఎనిమిదికి చేరినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఒక బాలిక ఉన్నారన్నారు.
సమాచారం అందుకున్నపోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెల్లవారుజామున హైవేల్లో జరిగే ప్రయాణాల్లో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధికారులు పోలీసులు సూచిస్తున్నారు. డ్రైవర్లు వేగ నియంత్రణ పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.





