ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి మరో అడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌గా ప్రమోట్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం స్థానిక ప్రజలకు సంతోసాన్ని కలిగిస్తుంది.
సెలక్షన్ గ్రేడ్ హోదా పొందడం ద్వారా పిఠాపురం పట్టణానికి మరిన్ని నిధులు, మెరుగైన మౌలిక వసతులు అందే అవకాశం ఉందని, పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం కావడంతో పాటు, శుద్ధి నీరు, రోడ్లు, కాల్వలు, పారిశుద్ధ్య సదుపాయాలు వంటి కీలక రంగాల్లో మెరుగుదల కనిపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్, ప్రత్యేక అధికారి పంపిన ప్రతిపాదనలను ఆయన ప్రత్యేకంగా పరిశీలించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పట్టణానికి మెరుగైన హోదా కల్పించాలనే ఉద్దేశంతో పవన్ ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే ముందు 2021 నుంచి 2025 వరకు పిఠాపురం మున్సిపాలిటీ ఆదాయం, వ్యయాల వివరాలను సమగ్రంగా పరిశీలించింది. మున్సిపాలిటీ ఆర్థిక స్థితి, అభివృద్ధి సామర్థ్యం, భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకుని సెలక్షన్ గ్రేడ్‌కు అర్హత ఉందని నిర్ణయించింది. సాధారణంగా సంవత్సరానికి రూ.8 కోట్లకు పైగా ఆదాయం ఉన్న మున్సిపాలిటీలకు ఈ హోదా ఇస్తారు.
సెలక్షన్ గ్రేడ్‌గా ప్రమోట్ కావడంతో పిఠాపురం మున్సిపాలిటీకి అదనపు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే, ప్రభుత్వ పథకాలు వేగంగా అమలు కావడం, పట్టణ అభివృద్ధి పనులు సమర్థవంతంగా జరిగేలా చర్యలు తీసుకోవడం సులభమవుతుంది. దీని ద్వారా స్థానిక ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయని ఆశిస్తున్నారు.
పిఠాపురం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించిన ప్రభుత్వం ‘పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ’ (పీఏడీఏ)ని ఏర్పాటు చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ‘అమృత్ భారత్’ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు రూ.37.25 కోట్లు మంజూరు చేయడం గమనార్హం.





