అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును ఈ దశలో నిలిపివేయడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
కృష్ణా జిల్లా ఆత్కూరు గ్రామానికి చెందిన రైతు కన్నిగంటి ఆంజనేయ ప్రసాద్ ఈ పిల్‌ను దాఖలు చేశారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌పై ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, తన భూమికి అన్యాయం జరుగుతుందని కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా కోర్టు పిటిషనర్ వాదనలను శ్రద్ధగా విన్నప్పటికీ, ప్రాజెక్టు అమలు ప్రక్రియను అడ్డుకోవడానికి తగిన కారణాలు లేవని అభిప్రాయపడింది. ముఖ్యంగా, ప్రజాప్రయోజన వ్యాజ్యం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారేమో అన్న అనుమానాన్ని కూడా ధర్మాసనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషన్ వెనుక ఉన్న ఉద్దేశ్యం పట్ల కోర్టు సందేహం వ్యక్తం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అమరావతి ఓఆర్ఆర్ ప్రాజెక్టు రాష్ట్ర రాజధాని అభివృద్ధికి కీలకమని ప్రభుత్వం వాదించింది. ఈ రింగ్ రోడ్డు ద్వారా రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు, పెట్టుబడులు ఆకర్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు. ట్రాఫిక్ సమస్యలను తగ్గించడంతో పాటు, ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు కోర్టుకు వివరించారు.
కోర్టు కూడా ఈ వాదనలను పరిగణనలోకి తీసుకుని, ప్రాజెక్టును నిలిపివేయడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని అభిప్రాయపడింది. అభివృద్ధి కార్యక్రమాలను నిరోధించడం కన్నా, అవసరమైతే పిటిషనర్ వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకునే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇకపై ఈ కేసు విచారణ కొనసాగనుండగా, పిటిషనర్ వాదనలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు పరిశీలించనుంది. అయితే ప్రస్తుతానికి ఓఆర్ఆర్ నిర్మాణంపై ఎలాంటి అడ్డంకులు లేవని స్పష్టం కావడంతో ప్రాజెక్టు పనులు యథావిధిగా కొనసాగనున్నాయి.
ఈ తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడినట్టుగా తెలుస్తుంది. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ఈ ప్రాజెక్టు వేగవంతంగా పూర్తి కానుంది.





