మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నీ వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మార్కెట్ రుసుము వసూళ్లను పారదర్శకంగా, సమర్దవంతంగా చేయడానికి చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు.
అదేవిధంగా రూ 568.50 కోట్లు గత రెండు సంవత్సరాలలో, మార్కెటింగ్ యార్డ్ లలో 630 అభివృద్ధి పనులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిలో 128 కోట్లు విలువైన 113 పనులు పూర్తయినట్లు తెలిపారు.
ఈ సందర్భములో మంత్రి మాట్లాడుతూ, ఇంకా కొన్ని చోట్ల జీరో బిజినెస్ జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వస్తుందని, దీని పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. జీరో బిజినెస్ చేసే ట్రేడర్ల లైసెన్స్లు రద్దు చేయడానికి ఉపేక్షించవద్దని, అదేవిధంగా దీనికి ఎవరైనా అధికారులు సహకరిస్తే క్రమశిక్ష చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని, వాటి పురోగతిని రోజు వారి సమీక్షించేటందుకు వీలుగా ఒక డాష్ బోర్డు ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు.
మార్కెట్ యార్డ్ లకు వచ్చే రైతులకు సౌకర్యం కల్పించే పనులను ప్రాధాన్యత పాతిపదికన చేపట్టాలని అదేవిధంగా, పంట ఉత్పత్తులు రక్షించే విధంగా చేపట్టే పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచించారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ విభాగములో అవసరమైతే మరికొంత మందిని వేరే శాఖల నుండి డిప్యూటేషన్ పై తీసుకొనే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా సెక్రటరీని మంత్రి కోరారు.
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీలో ‘స్మార్ట్ మార్కెట్ యార్డ్ ‘ సాఫ్ట్ వేర్ ల ద్వారా మార్కెట్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మంత్రి స్పందిస్తు ఒక సీజన్ లో అమలు చేసిన తరువాత, ఆశాజనక ఫలితాలు ఉంటే, అన్నీ మార్కెట్ యార్డ్ కమిటీలను “ డిజిటలైజేషన్ చేసి జీరో బిజినెస్ ను ఆరికట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.





