మహారాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ గాయని ఆశా భోంస్లే ఆలోచనలకు అనుగుణంగా ఒక ప్రతిష్టాత్మక మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిష్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపారు.
సోమవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆశా భోంస్లేకు ఘన నివాళులు అర్పించిన అనంతరం ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆశాజీ సంగీత రంగంలో చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆమె వారసత్వాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి సునేత్రా అజిత్ పవార్ తో పాటు పలువురు కేబినెట్ సభ్యులు పాల్గొన్నారు. అందరూ ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి మద్దతు తెలిపారు. రాష్ట్రంలో సంగీత విద్యకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని, యువతలో ప్రతిభను ప్రోత్సహించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఈ సందర్బంగా తెలియజేశారు.
ఆశా భోంస్లేకు నివాళులర్పిస్తూ ఫడ్నవిస్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. “ఈరోజు సుమధుర స్వరాల ఉద్యానవనం నిర్మానుష్యంగా మారింది. ఆశా తాయ్ స్వరం సంగీతానికి ఆత్మ లాంటిది” అని అన్నారు. “‘తోరా మన్ దర్పణ్ కెహలాయే’ వంటి ఆర్ద్ర గీతాల నుంచి ‘ఖల్లాస్’ వంటి హుషారైన పాటల వరకు ఆమె ప్రతి భావాన్నీ సులభంగా పలికించారు.
ప్రతిపాదిత మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆధునిక సౌకర్యాలు, ప్రఖ్యాత గురువుల శిక్షణ, వివిధ సంగీత శైలులపై ప్రత్యేక కోర్సులు అందించనున్నారు. హిందుస్తానీ, కర్ణాటక సంగీతంతో పాటు ఆధునిక సంగీతం, ఫ్యూజన్ మ్యూజిక్ వంటి విభాగాల్లో కూడా శిక్షణ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.
ఈ ఇన్‌స్టిట్యూట్ ద్వారా యువ కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థులకు కూడా ప్రత్యేక సదుపాయాలు కల్పించే అవకాశముంది. స్కాలర్‌షిప్‌లు, ఉచిత శిక్షణ వంటి కార్యక్రమాలు కూడా అమలు చేసే దిశగా చర్చలు జరుగుతున్నాయని వారు తెలిపారు.
సంగీత రంగంలో ఆశా భోంస్లే చేసిన సేవలు అపారమైనవి. అనేక భాషల్లో తన గాత్రంతో కోట్లాది అభిమానులను అలరించారు. ఆమె ఆలోచనల ఆధారంగా ఈ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు సంగీతంపై మరింత ఆసక్తి పెరుగుతుందని ఆయన తెలిపారు.
సోమవారం సాయంత్రం ముంబైలోని శివాజీ పార్క్ శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సూర్యాస్తమయ వేళ, అశ్రునయనాల మధ్య ఆమెకు తుది వీడ్కోలు పలికారు.





