హజ్ యాత్ర సీజన్ సమీపిస్తున్న వేళ సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది ముస్లింలు మక్కా నగరానికి తరలివచ్చే ఈ సమయంలో, యాత్రికుల రద్దీని క్రమబద్ధీకరించడానికి భద్రతా ఏర్పాట్లను బలోపేతం చేయడం కోసం మక్కా నగర ప్రవేశంపై కఠిన ఆంక్షలు అమలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
కొత్త ఆంక్షలు ఇలా ఉన్నాయి. ఈరోజు నుంచి మక్కాలోకి ప్రవేశించేందుకు ప్రత్యేక అనుమతి పత్రాలు తప్పనిసరి. అనుమతి లేకుండా ఎవరైనా నగరంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే, వారిని సరిహద్దు తనిఖీ కేంద్రాల వద్దే అడ్డుకుని తిరిగి పంపిస్తామని వారి తెలిపారు. ఈ నిర్ణయం విదేశీయులతో పాటు స్థానిక నివాసితులకూ కూడా వర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు.
ప్రతి సంవత్సరం హజ్ యాత్ర సందర్భంగా మక్కా నగరంలో విపరీతమైన జనసమ్మర్థం ఏర్పడుతుంది. ఈ భారీ రద్దీ కారణంగా భద్రతా సమస్యలు తలెత్తే అవకాశం ఉండటంతో పాటు, యాత్రికులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం అవుతుందని భావించిన సౌదీ ప్రభుత్వం ఈసారి మరింత కఠిన నియంత్రణలు అమలు చేయాలని నిర్ణయించింది.
కేవలం మక్కా నగరంలో పనిచేసే వర్క్ పర్మిట్ కలిగిన వారు, అక్కడి అధికారుల ద్వారా జారీ చేయబడిన రెసిడెన్సీ ఐడీ (ఇఖామా) ఉన్నవారు, లేదా చెల్లుబాటు అయ్యే హజ్ పర్మిట్ కలిగిన యాత్రికులకే నగరంలోకి ప్రవేశానికి అనుమతి ఉంటుంది. ఇతరులందరికీ ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది.
ఈ నియమాలను అమలు చేయడానికి సరిహద్దు ప్రాంతాల్లో, ప్రధాన రహదారుల వద్ద, చెక్పోస్టుల్లో భద్రతా బలగాలను భారీగా మోహరించారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనుమతి పత్రాలు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మక్కాలోకి అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సౌదీ అధికారులు హెచ్చరించారు. అవసరమైతే జరిమానాలు విధించడం, దేశంలో ప్రవేశ నిషేధం వంటి చర్యలు కూడా తీసుకునే అవకాశముందని సమాచారం. దీంతో యాత్రికులు ముందుగానే అవసరమైన పర్మిట్లు పొందాలని సూచించారు.
హజ్ యాత్రను మరింత సురక్షితంగా, సజావుగా నిర్వహించాలన్నదే సౌదీ ప్రభుత్వ లక్ష్యమని. యాత్రికుల సౌకర్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఈ నిర్ణయానికి అంతర్జాతీయ స్థాయిలో కూడా మద్దతు లభిస్తోందని తాము భావిస్తున్నట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది.





