వరంగల్లోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులను వేధించినట్లు ఆరోపణలు రుజువయ్యాయి, కాలేజీ యాజమాన్యం ఏడుగురు థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంది.
కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంధ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను ఆరు నెలల పాటు క్లాసుల నుంచి సస్పెండ్ చేయడంతో పాటు, కోర్సు పూర్తయ్యే వరకు హాస్టల్ నుంచి శాశ్వతంగా బహిష్కరించినట్లు ఆమె తెలిపారు.
ఈ ఘటనకు మూలం ఒక వాట్సాప్ గ్రూప్‌లో జరిగిన చర్చ. కొందరు సెకండ్ ఇయర్ విద్యార్థులు తమ సీనియర్లపై కొన్ని వ్యాఖ్యలు చేయడంతో వివాదం మొదలైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న సీనియర్ విద్యార్థులు ఆగ్రహానికి లోనై, జూనియర్లను హాస్టల్ టెర్రస్‌పైకి పిలిపించారు.
అనంతరం వారిని మోకాళ్లపై నిలబెట్టి క్షమాపణ చెప్పించారు. ఈ ఘటన మొత్తం జూనియర్ విద్యార్థుల్లో భయాందోళనలకు దారి తీసింది. అయితే, ఈ ఘటనను కొందరు జూనియర్లు తమ మొబైల్ ఫోన్లలో రహస్యంగా వీడియోగా రికార్డ్ చేసి ఆ రికార్డును యాజమాన్యానికి పంపింది.
ఆ వీడియో ఆధారంగా తీసుకుని కాలేజీ యాజమాన్యం విచారణ చేపట్టింది. ఈ ఘటన నిజమని నిర్ధారణ కావడంతో వెంటనే కఠిన చర్యలు తీసుకుంది. ర్యాగింగ్‌పై యాజమాన్యం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేసింది.
విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌పై ఇప్పటికే కఠిన చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది. విద్యార్థుల భద్రత, గౌరవం కాపాడటం ప్రతి విద్యాసంస్థ బాధ్యతగా నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ సంఘటన నేపథ్యంలో కాలేజీలో అదనపు పర్యవేక్షణ చర్యలు చేపట్టినట్లు సమాచారం. యాంటీ-ర్యాగింగ్ కమిటీలు మరింత చురుకుగా పనిచేస్తున్నాయని యాజమాన్యం తెలిపింది. విద్యార్థులు ఎవరైనా ఇలాంటి వేధింపులకు గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.





