సాధారణంగా పెళ్లిళ్లలో చిన్న చిన్న గొడవలు, అలకలు జరుగుతుంటాయి. కానీ ఈ ఘటనలో మాత్రం చిన్న వివాదం ఏకంగా పెళ్లి రద్దుకి దారితీసింది. కల్యాణ మండపంలో ముహూర్తానికి కొన్ని గంటల ముందే వరుడి కుటుంబం పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోవడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే, కడప జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన సులేమాన్ అనే యువకుడికి, కడప నగరానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. మార్చి 28న ఓ కల్యాణ మండపంలో ఇరు కుటుంబాలు ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశాయి. బంధుమిత్రులు, ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పెళ్లికి హాజరయ్యారు.
పెళ్లి రోజున సందడి కొనసాగింది. ఇంతలో కొద్ది సేపటికే పరిస్థితి మారింది. వరుడి తరఫు వారు తమకు కేటాయించిన గదుల్లో సరైన వసతులు లేవని ఆరోపిస్తూ వధువు కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. వధువు కుటుంబ సభ్యులు ఎంత నచ్చచెప్పడానికి ప్రయత్నించిన వారు వినలేదు. గొడవను ఇంకా పెంచారు.
చిన్నగా ప్రారంభమైన పెద్ద గొడవగా మారింది. వధువు కుటుంబ సభ్యులు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినప్పటికీ, వరుడి కుటుంబం తగ్గించుకోలేదు. సరే “సౌకర్యాలు సరిపోవడం లేదు” అనే కారణంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
వధువు కుటుంబం బతిమాలినా, పరిస్థితిని సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. చివరకు, కొద్దిసేపటికి తిరిగి వస్తామని చెప్పి వరుడి కుటుంబం మొత్తం మండపం నుంచి వెళ్లిపోయింది. అయితే ముహూర్తం సమయం దగ్గరపడుతున్నప్పటికీ వారు తిరిగి రాలేదు. దీంతో పెళ్లి ఆగిపోయిందని వధువు కుటుంబం నిర్ధారించుకుంది.
ఈ అనూహ్య పరిణామంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు, ఖర్చులు అన్నీ వృథా కావడంతో పాటు, కుటుంబ గౌరవానికి కూడా దెబ్బతగిలిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
స్థానికంగా ఈ ఘటన పెద్ద చర్చకు దారితీసింది. చిన్న సమస్యలను పెద్దవిగా తీసుకుని, జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను ప్రభావితం చేయడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పెళ్లిళ్లు అనేవి రెండు కుటుంబాలను కలిపే బంధం అని, ఇలాంటి సంఘటనలు సమాజానికి తప్పుడు సందేశం ఇస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.
వరుడు కుటుంబ సభ్యుల పెత్తనం.. అధునిక కాలంలో కూడా సాగడం.. కాలం ఎంత మారిన ఇంకా కొన్ని కుటుంబాల్లో ఇలాంటి సంఘటనలు తలెత్తడం గనార్హం





