ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్హోల్ ఫ్రీ రహదారుల నిర్మాణం, ఎలక్ట్రిక్ బస్సుల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయంలో రహదారులు, భవనాలు, రవాణా శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడంలో భాగంగా రహదారుల నాణ్యతను పెంపొందించాలన్నారు.
ఈ సమీక్ష సమావేశానికి బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, తదితర మంత్రులు హాజరయ్యారు. అలాగే రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యంతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సమీక్షలో రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్లకు పైగా రహదారుల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రహదారులు ఎక్కడా గుంతలు లేకుండా పాత్హోల్ ఫ్రీగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారుల నాణ్యత మెరుగుపడితే ప్రజల ప్రయాణం సౌకర్యవంతంగా మారడమే కాకుండా, ప్రమాదాలు కూడా తగ్గుతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల భౌగోళిక పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేసి, దానికి అనుగుణంగా రహదారుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాలు, ఎడారి ప్రాంతాలు వంటి భిన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక నిర్మాణ పద్ధతులను అనుసరించాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు.
రవాణా వ్యవస్తపై కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన రవాణా అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను విస్తృతంగా వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇంధన వ్యయాన్ని తగ్గించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగపడుతుందని ఆయన అధికారులకు తెలిపారు.
ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈవీ బస్సులు ఒక సమర్థవంతమైన పరిష్కారంగా మారుతున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సమీక్ష సమావేశంలో పాల్గొన్న అధికారులు, మంత్రులు ముఖ్యమంత్రి సూచనలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల నిర్వహణను పర్యవేక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.





