వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కనక దుర్గ’ చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సురేఖ కొణిదెల హాజరై, సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మంచి అంచనాలను సృష్టిస్తోంది.
తమిళ సినీ పరిశ్రమలో విజయవంతమైన కంటెంట్ స్టూడియోగా గుర్తింపు పొందిన అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇప్పుడు తెలుగులోకి అడుగుపెడుతోంది. తమ తొలి తెలుగు ప్రాజెక్ట్‌గా ‘కనక దుర్గ’ను ఎంపిక చేయడం
ప్రత్యేకతను సూచిస్తుంది.. ఈ చిత్రంలో అల్లరి నరేష్ హీరోగా నటిస్తుండగా, కాజల్ చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. అలాగే ప్రముఖ నటుడు సుబ్బరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఈ చిత్రం భక్తి ప్రధాన కథాంశంతో రూపొందుతోంది. భారతీయ దేవతల ఆధారంగా ఒక దివ్యమైన ప్రపంచాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం వంటి అన్ని అంశాలను సమన్వయం చేస్తూ ఒక సమగ్ర సినీ అనుభూతిని అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. కథను బి.వి.ఎస్. రవి అందించగా, నిర్మాణ బాధ్యతలను సమీర్ నాయర్, దీపక్ సెహగల్, అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్. రవి తీసుకున్నారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. గౌరవ దర్శకురాలిగా స్వప్న దత్ వ్యవహరించగా, శ్యామ్ ప్రసాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు. కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై సినిమా యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని మాట్లాడుతూ, దక్షిణ భారత సినిమా ఎప్పటికీ కథలను చెప్పడంలో ముందుంటుందన్నారు. తమిళంలో తమ ప్రయాణం విజయవంతమైందని, ఇప్పుడు ‘కనక దుర్గ’తో తెలుగులోకి అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉందని సంతోషాన్ని వ్యక్త పరిచారు. ఈ సినిమా భక్తి, సంస్కృతి, భావోద్వేగాల సమ్మేళనంగా ఉంటుందని చెప్పారు. తెలుగు ప్రజలకు తప్పకుండా నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
టెంపుల్ టౌన్ పిక్చర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్ మరియు బి.వి.ఎస్. రవి మాట్లాడుతూ, ఈ సినిమా తెలుగు సంస్కృతి , ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తమ బ్యానర్‌లో రూపొందుతున్న తొలి తెలుగు సినిమా కావడం గర్వంగా ఉందని చెప్పారు. మంచి కథతో పాటు మంచి భాగస్వామ్యంతో ఈ సినిమా రూపొందుతుండటం ఆనందంగా ఉందన్నారు.
దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ, ‘కనక దుర్గ’ సినిమా తనకు ఎంతో ప్రత్యేకమని అన్నారు. ఈ సినిమా కేవలం భక్తి కథ మాత్రమే కాకుండా, ఒక వ్యక్తి జీవితంలో ఎదురయ్యే కష్టాలు, అతను ఒక ఉన్నత శక్తిని ఎదుర్కొన్నప్పుడు జరిగే పరిణామాలను చూపిస్తుందని వివరించారు. భావోద్వేగంతో పాటు విజువల్‌గా కూడా ఈ చిత్రం భారీ స్థాయిలో ఉండనుందని తెలిపారు.
కార్యక్రమం చివర్లో కనకదుర్గ అమ్మవారి దివ్య స్త్రీ శక్తిని స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. హాజరైన మహిళలు కలిసి అమ్మవారి మహిమలను గౌరవించారు.





