సుస్థిరాభివృద్ధి అంశంపై తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య రాజకీయ వాగ్వాదం చెలరేగింది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సోషల్ మీడియా వేదిక X లో చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి దారితీశాయి. తెలంగాణ సుస్థిరాభివృద్ధిలో ఆరో స్థానంలో ఉందని ఆయన చేసిన విమర్శలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విజయన్ చేసిన వ్యాఖ్యలను ‘అసంబద్ధ పోలిక’గా పేర్కొంటూ, 6 పేజీల లేఖను రాశారు. వాస్తవ గణాంకాలతో కూడిన సుదీర్ఘ వివరణను అందించారు. సోమవారం విడుదల చేసిన ఆరు పేజీల లేఖలో తెలంగాణ అభివృద్ధి సూచికలను వివరంగా ప్రస్తావిస్తూ, రాష్ట్రం సాధించిన పురోగతిని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి తన లేఖలో తెలంగాణ వివిధ రంగాల్లో సాధించిన విజయాలను చర్చించారు. ముఖ్యంగా ఆర్థికాభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి, వ్యవసాయ రంగం, సంక్షేమ పథకాలు వంటి అంశాల్లో రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని పేర్కొన్నారు. కేవలం ఒక సూచిక ఆధారంగా రాష్ట్రాన్ని అంచనా వేయడం సరైన విధానం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో విజయన్ సర్కారు 120 నెలలుగా అధికారంలో ఉందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కేవలం 28 నెలలే అయ్యిందని పేర్కొన్నారు. 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని తమ 28 నెలల పాలనతో పోల్చడం విజయన్ వంటి సీనియర్ నేత స్థాయికి తగదని హితవు పలికారు.
ఇక, పినరయి విజయన్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో రేవంత్ రెడ్డి మలయాళ భాషలోనే స్పందించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది రాజకీయంగా చురుకైన వ్యూహంగా భావించబడుతోంది. ప్రత్యర్థి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన భాషలోనే సమాధానం ఇవ్వడం ద్వారా తన వాదనను మరింత బలంగా వినిపించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
ఈ ఘటనతో సోషల్ మీడియాలో చర్చలు ముదిరాయి. రెండు రాష్ట్రాల అనుచరులు తమ తమ నాయకుల వ్యాఖ్యలను సమర్థిస్తూ వాదనలు చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం జరుగుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
కేరళంలో పేదరికం గల్ఫ్ దేశాల నుంచి వస్తున్న విదేశీ మారకద్రవ్యం వల్లే సాధ్యం అవుందని, ఇది గత 60 ఏళ్లుగా అన్ని ప్రభుత్వాలు చేసిన కృషి అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఏప్రీల్ 7న తిరువనంతపురం వచ్చి 28 నెలల్లో కాంగ్రెస్ తెలంగాణలో చేసిన అభివృద్ధి పనుల గురించి వివరిస్తానని తెలిపారు. కేరళ ప్రజలు నేర్పిన మాటను ఆప్యాయతతో మీకు చెబుతున్నానని నీ పో, మోనే విజయన్ అంటూ తన లేఖను ముగించారు తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి





