‎​దక్షిణాది అభివృద్ధి చెందితేనే.. దేశాభివృద్ధి పరుగులు: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Must read


‎కేంద్ర–రాష్ట్రాల మధ్య  ఉన్న సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించడంతో పాటు తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయడమే సహకార సమాఖ్యవాద స్ఫూర్తి అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. భిన్నమైన ప్రయోజనాలు ఎదురైనప్పుడు కూడా న్యాయబద్ధమైన పరిష్కారాన్ని కనుగొనగలగడమే సమాఖ్య వ్యవస్థకు అసలైన పరీక్ష అని ఆయన పేర్కొన్నారు.

‎ మహాబలిపురంలో జరిగిన 31వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశంలో ఆయన తెలంగాణ వైఖరిని స్పష్టంగా వెల్లడించారు. కేంద్ర హోం శాఖ మంత్రి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌మావేశంలో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌తో పాటుగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్‌, కేర‌ళం ముఖ్య‌మంత్రి వీడీ స‌తీష‌న్‌, త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ ఇత‌ర కీల‌క నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ.. మహాబలిపురంలోని చారిత్రక కట్టడాలను ప్రస్తావించారు. బలమైన నిర్మాణానికి ప్రతి భాగం ఒకేలా ఉండాల్సిన అవసరం లేదని, ప్రతి భాగం తన వంతు భారాన్ని మోయాల్సి ఉంటుందని అన్నారు. భారత సమాఖ్య వ్యవస్థ కూడా ఇదే స్ఫూర్తితో పనిచేయాలని పేర్కొన్నారు. భిన్నమైన ప్రయోజనాలను న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, సమర్థవంతంగా సమన్వయం చేయగల సంస్థలు ఉండటమే నిజమైన సమాఖ్యవాదమ‌ని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

‎పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు, ప్రతిభ కోసం రాష్ట్రాల మధ్య పోటీ సహజమేనని ఆయ‌న చెప్పుకొచ్చారు.  నదులు, విద్యుత్‌ గ్రిడ్లు, కార్మికులు, వ్యాపారాలకు రాష్ట్ర సరిహద్దులు అడ్డంకులు కావని డిప్యూటీ సీఎం చెప్పారు.  సమస్యలు రాష్ట్ర సరిహద్దులను ప్రభుత్వ ఫైళ్ల కంటే వేగంగా దాటుతాయి భ‌ట్టి చ‌మ‌త్క‌రించారు.  ఈ పరస్పర ఆధారిత పరిస్థితుల నేపథ్యంలో దక్షిణ ప్రాంతీయ మండలి వంటి సంస్థల ప్రాధాన్యత‌ మరింత పెరుగుతోందన్నారు. నిబంధనలు స్పష్టంగా ఉండడంతో పాటుగా అన్ని రాష్ట్రాలకు ఒకే నిబంధనలు వర్తించాలని తెలంగాణ కోరుకుంటోందని తెలిపారు.


‎నీటి భద్రత, ఇంధన భద్రత, వాతావరణ మార్పులు, పట్టణీకరణ, రవాణా–లాజిస్టిక్స్, ఆర్థిక పోటీతత్వం వంటి అంశాలు రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాలకు కీలక సవాళ్లుగా మారనున్నాయని అన్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్రాలు పోటీ పడుతూనే పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. దక్షిణ భారతదేశం కలిసి అభివృద్ధి చెందితే, భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు.

‎తదుపరి 32వ దక్షిణ ప్రాంతీయ మండలి సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సమస్యలకు చర్చల ద్వారా శాశ్వత పరిష్కారాలు కనుగొనాలని ఆకాంక్షించారు. ట్రిబ్యునల్ లేకుండా, కమిటీ లేకుండా, బహుశా మరోసారి ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా లేకుండా సమస్యలు పరిష్కారం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరయ్యే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆత్మీయ ఆతిథ్యం అందిస్తుందని ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ తెలిపారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!