భారత్‌తో దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదం నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వానికి కొత్త చిక్కు ఎదురైంది. ఇరు దేశాల మధ్య ఆధునిక సరిహద్దుకు చారిత్రక ఆధారంగా పరిగణించే 1816 నాటి సుగౌలీ ఒప్పందం అసలు పత్రం తమ వద్ద ఉందా లేదా అనే విషయంపై స్పష్టత లేదని నేపాల్ ప్రభుత్వం పార్లమెంటుకు వెల్లడించింది. ముఖ్యంగా లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలపై భారత్‌తో వివాదం కొనసాగుతున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సుగౌలీ ఒప్పందం నేపాల్-బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య కుదిరిన చారిత్రక ఒప్పందం కాగా, 1816లో దాని ధ్రువీకరణ జరిగింది. ఈ ఒప్పందం ఆధారంగానే నేపాల్ పశ్చిమ సరిహద్దుకు సంబంధించిన కీలక అంశాలు నిర్ధారించబడ్డాయి.
నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని చారిత్రక ఒప్పందాలకు సంబంధించిన రికార్డులు నేషనల్ ఆర్కైవ్స్‌లో ఉన్నప్పటికీ, అవి అసలు ఒప్పంద పత్రాలేనా? లేక వాటి ప్రతులా? అనే విషయంలో స్పష్టత లేదని ప్రభుత్వం తెలిపింది. సుగౌలీ ఒప్పందంతో పాటు 1950 నాటి నేపాల్-భారత్ శాంతి, స్నేహ ఒప్పందానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్లు సమాచారం. ఈ రెండు ఒప్పందాలు నేపాల్ చరిత్ర, విదేశాంగ విధానం, భారత్‌తో సంబంధాల్లో అత్యంత కీలకమైనవిగా భావిస్తారు.
సుగౌలీ ఒప్పందం నేపాల్-భారత్ సరిహద్దు చరిత్రలో అత్యంత ముఖ్యమైన పత్రాల్లో ఒకటి. 1814-16 మధ్య జరిగిన ఆంగ్లో-నేపాల్ యుద్ధం అనంతరం ఈ ఒప్పందం కుదిరింది. 1815 డిసెంబర్ 2న ఒప్పందంపై సంతకాలు జరగగా, 1816 మార్చి 4న నేపాల్ తరఫున దాని ప్రతిని స్వీకరించినట్లు చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి. ఒప్పందంలోని నిబంధనలు నేపాల్ భూభాగం, సరిహద్దులు, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సంబంధాలకు సంబంధించిన కీలక అంశాలను నిర్దేశించాయి. ముఖ్యంగా నేపాల్ పశ్చిమ సరిహద్దుకు సంబంధించి కాళీ నదిని ప్రస్తావించడం తర్వాతి కాలంలో భారత్-నేపాల్ మధ్య సరిహద్దు వివాదానికి కేంద్ర అంశంగా మారింది.
ప్రస్తుతం భారత్-నేపాల్ మధ్య లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతాలను తమ భూభాగంగా నేపాల్ పేర్కొంటోంది. భారత్ మాత్రం ఈ వాదనలను అంగీకరించదు. సరిహద్దు వివాదాన్ని చారిత్రక ఒప్పందాలు, మ్యాప్‌లు, పరస్పర అంగీకారంతో దౌత్య మార్గాల్లో పరిష్కరించాల్సిందేనని ఇరు దేశాలు చెబుతున్నాయి. నేపాల్ విదేశాంగ మంత్రి ఖనాల్ కూడా గతంలో సరిహద్దు సమస్యలను ద్వైపాక్షిక చర్చలు, దౌత్యపరమైన ప్రక్రియల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సుగౌలీ ఒప్పందం అసలు పత్రం అందుబాటులో లేకపోవడం నేపాల్‌లో రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ ఒప్పందానికి సంబంధించిన ఏకైక ఆధారం ఒరిజినల్ పత్రం మాత్రమే కాదని, ఇతర చారిత్రక రికార్డులు, మ్యాప్‌లు, బ్రిటిష్ కాలం నాటి పత్రాలు కూడా సరిహద్దు చర్చల్లో ఉపయోగపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయినప్పటికీ దేశ సరిహద్దులకు సంబంధించిన అత్యంత కీలకమైన చారిత్రక ఒప్పందం అసలు ప్రతిని భద్రపరచలేకపోవడం ప్రభుత్వ రికార్డుల నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
నేపాల్ పార్లమెంటులో ఈ అంశం గతంలోనూ పలుమార్లు చర్చకు వచ్చింది. సుగౌలీ ఒప్పందం, 1950 నాటి నేపాల్-భారత్ శాంతి, స్నేహ ఒప్పందాల అసలు ప్రతులు ఎక్కడ ఉన్నాయనే ప్రశ్నను ఎంపీలు ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చారు. 2019లోనూ ఈ రెండు కీలక ఒప్పందాల ఒరిజినల్ కాపీలు నేషనల్ ఆర్కైవ్స్‌లో లేవనే విషయం చర్చకు వచ్చింది. తాజాగా మరోసారి అదే అంశం పార్లమెంటులో ప్రస్తావనకు రావడంతో చారిత్రక పత్రాల భద్రతపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నేపాల్ ప్రభుత్వం గత కొంతకాలంగా సరిహద్దు వివాదానికి సంబంధించిన చారిత్రక ఆధారాలను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది. బ్రిటిష్ కాలం నాటి ఆర్కైవ్స్‌లో ఉన్న పత్రాలను పరిశీలించేందుకు కూడా ప్రయత్నాలు జరిగినట్లు నేపాల్ విదేశాంగ మంత్రి గతంలో వెల్లడించారు. అయితే ఇది మూడో దేశం మధ్యవర్తిత్వం కోరడం కాదని, చారిత్రక ఆధారాలను సేకరించడం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. భారత్‌తో సరిహద్దు సమస్యలను ద్వైపాక్షికంగా పరిష్కరించడమే నేపాల్ విధానమని తెలిపారు.
లిపులేఖ్ ప్రాంతం విషయంలో భారత్-చైనా మధ్య ఉన్న ఒప్పందాలు కూడా నేపాల్ అభ్యంతరాలకు కారణమవుతున్నాయి. నేపాల్ తన అధికారిక మ్యాప్‌లో లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను తమ భూభాగంగా చూపించింది. ఈ ప్రాంతాల్లో సరిహద్దు గుర్తింపు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని నేపాల్ ప్రభుత్వం చెబుతోంది. విదేశాంగ మంత్రి ఖనాల్ ప్రకారం, సరిహద్దు నిర్ధారణకు సంబంధించిన పెండింగ్ అంశాలు ప్రధానంగా సుస్తా, లింపియాధురా, లిపులేఖ్, కాలాపానీ ప్రాంతాల్లో ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో సుగౌలీ ఒప్పందం అసలు పత్రం కోసం నేపాల్ ప్రభుత్వం చేస్తున్న అన్వేషణకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దేశ చరిత్రకు, సరిహద్దులకు సంబంధించిన అత్యంత విలువైన పత్రాలు ఎక్కడున్నాయనే విషయంపై స్పష్టత తీసుకురావాలని పలువురు ఎంపీలు కోరుతున్నారు. నేషనల్ ఆర్కైవ్స్‌తో పాటు పార్లమెంటరీ కమిటీ రికార్డులు, మ్యూజియంలు, విదేశాంగ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల్లో పత్రాల కోసం అన్వేషణ జరిపినట్లు నేపాల్‌లోని నివేదికలు పేర్కొంటున్నాయి.





