బీహార్ వ్యవసాయశాఖ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా బుధవారం రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావును సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బీహార్–తెలంగాణ రాష్ట్రాల మధ్య వ్యవసాయరంగంలో పరస్పర సహకారం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, ఉత్తమ విధానాల అధ్యయనం, పంటల వైవిధ్యీకరణ తదితర అంశాలపై ఇరువురు మంత్రులు విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో అమలు చేస్తున్న సాంకేతిక ఆధారిత కార్యక్రమాలు, రైతుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హాకు వివరించారు. వాతావరణ హెచ్చరికలను రైతులకు చేరవేయడం, రైస్ నేస్తం ద్వారా రైతులతో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనుసంధానం, క్రాప్ బుకింగ్, శాటిలైట్ ఆధారిత పంటల పర్యవేక్షణ, యూరియా బుకింగ్ అప్లికేషన్, అగ్రిస్టాక్ ద్వారా రైతు గుర్తింపు వంటి డిజిటల్ కార్యక్రమాలను వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత ‘కృషివాస్’ పంటల పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా పంటల్లో సమస్యలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రాంతాల్లోనే సత్వర చర్యలు చేపట్టడం ద్వారా రైతుల పెట్టుబడి వ్యయాన్ని తగ్గించడం, దిగుబడిని పెంచడం, లాభదాయకతను మెరుగుపర్చే విధానాలను మంత్రి తుమ్మల వివరించారు.
రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణకు ఇస్తున్న ప్రాధాన్యతను కూడా మంత్రి తుమ్మల వివరించారు. తెలంగాణలో వరి, పత్తితో పాటు మొక్కజొన్న, కందులు, సోయాబీన్, మామిడి, ఎర్ర మిరప, పసుపు, ఆయిల్‌పామ్ తదితర పంటల సాగు విస్తరిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆయిల్‌పామ్ సాగులో తెలంగాణ దేశంలో ముందంజలో ఉందని, 2025-26లో 3.11 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు ఉండగా, 74 వేల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తితో 20.01 శాతం ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియో సాధించినట్లు వివరించారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, నర్సరీలు, ప్రాసెసింగ్ మిల్లులు, మైక్రో ఇరిగేషన్ వంటి మౌలిక సదుపాయాలపై కూడా బీహార్ మంత్రి ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదే సమయంలో బీహార్‌లో అమలు చేస్తున్న వ్యవసాయ విధానాలు, పంటల వైవిధ్యీకరణ, పంటల క్లస్టర్ల విధానం, సాంకేతిక వినియోగం తదితర అంశాలను బీహార్ మంత్రి శ్రీ విజయ్ కుమార్ సిన్హా తెలంగాణ ప్రతినిధులకు వివరించారు. బీహార్‌లో చిన్న, సన్నకారు రైతులు 91 శాతం ఉండగా, వ్యవసాయంపై ఆధారపడే జనాభా 77 శాతంగా ఉందని, వ్యవసాయ ఉత్పత్తుల వైవిధ్యానికి అనుగుణంగా ప్రత్యేక పంటల క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
ముఖ్యంగా మకానా, మొక్కజొన్న, పండ్లు–కూరగాయలు, తృణధాన్యాల కోసం ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేసి ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్ రంగాల్లో అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. దర్భంగా, మధుబని, సీతామర్హి ప్రాంతాల్లో మకానా క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. బీహార్‌లో మకానా పంటపై ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాల పట్ల మంత్రి తుమ్మల ఆసక్తి కనబరిచారు. ఇటీవల మకానా ఉత్పత్తి, పరిశోధన, విలువ జోడింపు, మార్కెటింగ్, అంతర్జాతీయ అవకాశాలను పెంపొందించేందుకు మకానా బోర్డును ఏర్పాటు చేసినట్లు బీహార్ ప్రతినిధులు వివరించారు. గత పదేళ్లలో మకానా సాగు విస్తీర్ణం, ఉత్పత్తి, ఉత్పాదకత 2.5 రెట్లకు పైగా పెరిగినట్లు వివరించారు.
బీహార్‌లో ఆయిల్‌పామ్ సాగు అవకాశాలపై ఆ రాష్ట్ర మంత్రి ఆసక్తి వ్యక్తం చేయగా, మంత్రి తుమ్మల బీహార్‌లో ప్రత్యేకంగా సాగవుతున్న మకానా పంట, దాని ఉత్పత్తి, విలువ జోడింపు, మార్కెటింగ్ విధానాలపై ఆసక్తి చూపారు. రెండు రాష్ట్రాల్లో రైతులకు ప్రయోజనం చేకూరే పంటల పరస్పర అధ్యయనం, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడికి దోహదం చేసుకోవాలని మంత్రి తుమ్మల కోరారు.
ఇందుకోసం ఆయిల్‌పామ్ సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు బీహార్ నుంచి వ్యవసాయశాఖ అధికారులు, ప్రతినిధుల బృందంతో పాటు రైతుల బృందాన్ని తెలంగాణకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ తోటలు, నర్సరీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, సాగులో అనుసరిస్తున్న ఆధునిక విధానాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. అదే విధంగా మకానా సాగు, ప్రాసెసింగ్, విలువ జోడింపు, మార్కెటింగ్ విధానాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ నుంచి ప్రతినిధుల బృందాన్ని బీహార్‌కు పంపిస్తామని తెలిపారు.
బీహార్‌లో ఆయిల్‌పామ్ సాగు విస్తరణకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, నాణ్యమైన నాటుసామగ్రి, సాగు విధానాలు, మైక్రో ఇరిగేషన్, ప్రాసెసింగ్ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తనవంతు సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు.వ్యవసాయరంగంలో రెండు రాష్ట్రాలకు ఉన్న ప్రత్యేక అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల వైవిధ్యీకరణ విధానాలను పరస్పరం పంచుకోవడం ద్వారా రైతుల ఆదాయం పెంపు, ఉత్పాదకత మెరుగుదల, విలువ జోడింపు, మార్కెట్ అవకాశాల విస్తరణకు మరింత ప్రయోజనం కలుగుతుందని ఇరువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ–బీహార్ మధ్య వ్యవసాయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ సెక్రటరీ సురేంద్ర మోహన్, వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపి, హాకా ఎండి చంద్రశేఖర్ రెడ్డి, కోఆపరేటీవ్ కమిషనర్ రాహుల్ రాజ్, హార్టీకల్చర్ యూనివర్సిటీ వీసీ రాజిరెడ్డి మరియు బిహార్ రాష్ట్ర వ్యవసాయశాఖ సెక్రటరీ నర్మదేశ్వర్ లాల్, వ్యవసాయశాఖ డైరెక్టర్ ముకేష్ కుమార్ లాల్, హార్టికల్చర్ డైరెక్టర్ అభిషేక్ కుమార్ పాల్గొన్నారు.





