ఆధునిక సమాజం శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్నో ముందడుగులు వేస్తున్నప్పటికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతున్న కొన్ని అనాగరిక కట్టుబాట్లు సామాజిక చైతన్యాన్ని ప్రశ్నించేలా మారుతున్నాయి. వ్యక్తిగత స్వేచ్ఛ, రాజ్యాంగ హక్కులు, ప్రేమ వివాహాలపై చట్టబద్ధ రక్షణ ఉన్నా.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం కుల ఆధిపత్యం, గ్రామ పెద్దల తీర్పులు ఇంకా కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఒక సామాజిక వెలివేత ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన తేజ, నాగలక్ష్మి అనే యువతీయువకులు కొంతకాలంగా ప్రేమించుకుని, పెద్దల వ్యతిరేకత మధ్య వివాహం చేసుకున్నారు. అయితే ఈ ప్రేమ వివాహాన్ని గ్రామంలోని కుల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇద్దరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడం, కుల సంప్రదాయాలను ధిక్కరించారని ఆరోపిస్తూ గ్రామ పెద్దలు ఆశ్యర్యకరమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో ప్రేమ జంటతో పాటు వారి కుటుంబ సభ్యులపై సామాజిక బహిష్కరణ విధించారు. గ్రామంలో ఎవరూ ఆ కుటుంబాలతో మాట్లాడకూడదని, వారి ఇళ్లకు వెళ్లకూడదని, ఎటువంటి సంబంధాలు కొనసాగించకూడదని గ్రామంలో చాటింపు వేయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఆంక్షలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై రూ.2 లక్షల వరకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించడం మరింత సంచలనంగా మారింది.
గ్రామ పెద్దల నిర్ణయంతో భయాందోళనకు గురైన ప్రేమ జంట చివరికి గ్రామాన్ని విడిచి వెళ్లిపోయినట్లు సమాచారం. అయితే వారితో పాటు గ్రామం విడిచి వెళ్లలేని అమ్మాయి కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో వారిని ఒంటరిని చేయడం, సామాజికంగా అవమానించడం, అవసరమైన సందర్భాల్లో సహకారం అందకుండా చేయడం వంటి పరిస్థితులు నెలకొన్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల తేజ, నాగలక్ష్మి దంపతులకు బాబు పుట్టడంతో కుటుంబ సభ్యులు ఆనందంగా బారసాల వేడుక నిర్వహించాలని నిర్ణయించారు. బంధువులు, పరిచయస్తులకు శుభలేఖలు పంచుతూ వేడుకకు ఆహ్వానించారు. అయితే దీనిపైనా గ్రామ పెద్దలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ కుటుంబం నిర్వహించే కార్యక్రమానికి ఎవరూ వెళ్లకూడదని మరోసారి గ్రామంలో ఆంక్షలు విధించారని సమాచారం.
ఈ నేపథ్యంలో శుభలేఖలు ఇవ్వడానికి వెళ్లిన కుటుంబ సభ్యులపై గ్రామ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గ్రామ తీర్పును ఉల్లంఘించారని ఆరోపిస్తూ వారికి మరోసారి రూ.2 లక్షల జరిమానా విధించాలని హుకుం జారీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ పరిణామాలతో కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు.
తమపై జరుగుతున్న అన్యాయంపై బాధిత కుటుంబ సభ్యులు మైలవరం పోలీసులను ఆశ్రయించారు. అయితే తమ ఫిర్యాదుపై ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దల బెదిరింపులు కొనసాగుతున్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రేమ వివాహం చేసుకోవడం భారత రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత హక్కు అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాంటి హక్కును అణచివేయడానికి సామాజిక వెలివేత, జరిమానాలు, బెదిరింపులు విధించడం చట్టవిరుద్ధమని పేర్కొంటున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు వెంటనే స్పందించి బాధితులకు రక్షణ కల్పించాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటన మరోసారి గ్రామీణ ప్రాంతాల్లో కొనసాగుతున్న కుల వివక్ష, సామాజిక ఆధిపత్యం, అనాగరిక ఆచారాలపై చర్చకు దారితీసింది. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడమే నేరమై కుటుంబాలను వెలివేయడం వంటి చర్యలు సమాజాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, పోలీసులు, సామాజిక సంస్థలు కలిసికట్టుగా ఇలాంటి ఘటనలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.





