పర్యాటక రంగానికి ‘డిజిటల్’ బూస్టర్! :మంత్రి జూప‌ల్లి కృష్ణారావు

Must read

“పర్యాటక రంగం కేవలం విహార యాత్రలకే పరిమితం కాదు.. అది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధికి, తెలంగాణ బ్రాండ్‌ ఇమేజ్‌కు శక్తివంతమైన సాధనం” అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 99 రోజుల కార్యాచరణను వేగవంతం చేసిన‌ రాష్ట్ర ప్రభుత్వం, పర్యాటక రంగానికి కొత్త ఊపునివ్వడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందన్నారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ‘తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశం’లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వ‌చ్చిన ఇన్ఫ్లుయెన్సర్లు ఇచ్చిన స‌ల‌హాలు సూచ‌న‌లు స్వీక‌రించి ప‌ర్యాట‌క రంగాన్ని మరింత మెరుగుప‌రుస్తామ‌ని చెప్పుతునే.. ప‌ర్యాట‌క ప్ర‌మోష‌న్ తో పాటు ప్ర‌జ‌ల్లో ముఖ్యంగా యువ‌త‌లో సామాజిక స్పృహ క‌లిగించడానికి కృషి చేయాల‌ని దిశానిర్ధేశం చేశారు.

పర్యాటక ప్రాంతాల ప్రోత్సాహంతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలిపారు. పర్యాటక రంగం ద్వారా వచ్చే ఆదాయాన్ని వైద్య, ఆరోగ్య, విద్యా రంగాల బలోపేతానికి, పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగిస్తామని చెప్పారు.

“మన ప్రాంతాలను మనమే చూడకపోతే జీవితం సంపూర్ణం కాదు” అని పేర్కొన్న ఆయన.. తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆర్థిక స్థోమత అడ్డంకి కాదన్నారు. అనవసర ఖర్చులను తగ్గించుకుని కుటుంబంతో కలిసి పర్యాటక ప్రాంతాల్లో గడపడం వల్ల మానసిక ప్రశాంతత, ఆనందం లభిస్తాయని సూచించారు.

దేశ, విదేశీ పర్యాటకులతో పాటు స్వరాష్ట్ర ప్రజలు కూడా తెలంగాణ పర్యాటక ప్రాంతాలను విస్తృతంగా సందర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్‌ వసతి సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టామని తెలిపారు. వినియోగంలో లేని హరిత మోటళ్లు, పర్యాటక భూములను ఆదాయ వనరులుగా మార్చే దిశగా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే టూరిజం క్రియేటర్లకు ప్రభుత్వం తరఫున అవార్డులు, ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేస్తామని మంత్రి జూపల్లి ప్రకటించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర పర్యాటక శాఖ నూతన మెటా ఖాతా, అధికారిక ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌ను మంత్రి జూపల్లి ఆవిష్కరించారు. తెలంగాణ చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, హస్తకళలు, చేనేత, కలంకారీ కళా వైభవాన్ని ప్రతిబింబించే ‘టైమ్‌లెస్ తెలంగాణ’ వీడియోను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమంలో పర్యాటక, భాషా సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, ఎండీ గౌతమి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ లక్ష్మి, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, నిథమ్ డైరెక్టర్ వెంకట రమణ, సాహిత్య అకాడమీ కార్యదర్శి బాలాచారి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!