తెలంగాణలో ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించే దిశగా కీలక అడుగు వేసింది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం. మీ-సేవ కేంద్రాలు, ఇంటర్నెట్ కేఫేలు చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వ సేవలను నేరుగా మొబైల్ ఫోన్లోనే పొందేలా ‘వాట్సాప్ చాట్‌బాట్’ సేవలను ప్రారంభించింది.ఈ సేవల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా 80969 58096 అనే వాట్సాప్ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఒక్క నంబర్ ద్వారానే రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ సేవలను పొందేలా ‘వన్ స్టాప్ షాప్’ విధానంలో ఈ వ్యవస్థను రూపొందించారు.
ప్రజలు ఈ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపగానే, వివిధ సేవలతో కూడిన మెనూ ప్రత్యక్షమవుతుంది. ప్రస్తుతం మీ-సేవ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న కులం, ఆదాయం వంటి ధ్రువపత్రాలకు దరఖాస్తు చేసుకోవడం, వాటి స్టేటస్ తెలుసుకోవడం, మున్సిపల్ పన్నులు చెల్లించడం వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి.ఇవి మాత్రమే కాకుండా రెవెన్యూ, విద్యుత్, పౌరసరఫరాల శాఖలకు సంబంధించిన కీలక సమాచారాన్ని కూడా ఈ చాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇటీవల ఇంటర్మీడియట్, పదో తరగతి, ఇతర ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లను కూడా ఇదే వాట్సాప్ ద్వారా అందించి ప్రభుత్వం విజయవంతంగా పరీక్షించింది.గతంలో ప్రతి శాఖకు వేర్వేరు వెబ్సైట్లు ఉండటంతో ప్రజలు గందరగోళానికి గురయ్యేవారు. ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని సేవలను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా పారదర్శకత, వేగం పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
ఇకపై ఫిర్యాదులు నమోదు చేయడం నుంచి సర్టిఫికెట్లు పొందడం వరకు అన్నీ ఒకే ప్లాట్‌ఫారమ్‌లో జరగనున్నాయి. దీంతో ప్రజల సమయం, శ్రమ రెండూ ఆదా అవుతాయని అధికారులు భావిస్తున్నారు.రానున్న రోజుల్లో ఈ సేవలను మరింత విస్తరించాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేయడం, అర్హతలు తెలుసుకోవడం, రేషన్ కార్డులు, పెన్షన్ల వివరాలు కూడా ఈ చాట్‌బాట్‌కు అనుసంధానించనున్నారు.
అంతేకాకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యే నగదు వివరాలను కూడా వాట్సాప్ ద్వారా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి ఉద్యోగ నియామక పరీక్షల హాల్ టికెట్లు, ఫలితాలు కూడా ఇదే వేదికలో అందించే అవకాశముంది.





