హైదరాబాద్‌లో ఆదాయపు పన్ను శాఖ మరో సంచలన ‘గోల్డ్ మ్యాన్’ కేసును వెలుగులోకి తీసుకొచ్చింది. యాదగిరి చిన్న గౌడ్ అలియాస్ దర్గా చిన్న పహిల్వాన్ వద్ద నుంచి సుమారు రూ.1 కోటి విలువైన లెక్కల్లో చూపని బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసు ప్రత్యేకత ఏమిటంటే, ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025లోని Section 247 of Income Tax Act 2025 కింద నమోదైన దేశవ్యాప్తంగా తొలి కేసు కావడం. గతంలో ఇలాంటి దాడులు పాత చట్టంలోని సెక్షన్ 132 కింద నిర్వహించేవారు.
Income Tax Department India హైదరాబాద్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ అధికారులు చిన్న పహిల్వాన్ నివాసం, అనుబంధ ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని వద్ద మొత్తం 900 గ్రాముల బంగారం ఉన్నట్లు గుర్తించగా, అందులో 700 గ్రాములకు సరైన లెక్కలు లేవని తేలింది. దీంతో ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే వ్యక్తిగత వినియోగం కోసం సుమారు 150 నుంచి 200 గ్రాముల బంగారాన్ని తిరిగి ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు.ఈ దర్యాప్తు ఆసక్తికరమైన రీతిలో ప్రారంభమైంది. టీవీ ఛానళ్లలో, యూట్యూబ్‌లో చిన్న పహిల్వాన్ ఇచ్చిన ఇంటర్వ్యూలను ఆధారంగా తీసుకుని ఐటీ శాఖ సోషల్ ప్రొఫైలింగ్ చేసింది. భారీగా బంగారు ఆభరణాలు ధరించి కనిపించడం వల్ల అనుమానం కలిగి విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లో ఐటీ శాఖ దృష్టికి వచ్చిన మూడో ‘గోల్డ్ మ్యాన్’ కేసు ఇదే. ఇంతకుముందు కొండా విజయకుమార్, సూర్య భాయ్ లపై కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారు.విచారణలో చిన్న పహిల్వాన్ తన వద్ద ఉన్న బంగారం లెక్కల్లో లేనిదని అంగీకరించినట్లు సమాచారం. అద్దెలు, భూముల వ్యాపారం ద్వారా ఈ బంగారం సంపాదించానని చెప్పినప్పటికీ, సరైన ఆధారాలు చూపించలేకపోయాడు. అతను దాఖలు చేసిన ఐటీ రిటర్న్‌లో కేవలం రూ.4 లక్షల ఆదాయం మాత్రమే చూపినట్లు అధికారులు గుర్తించారు.దర్యాప్తులో మరో కీలక అంశం బయటపడింది. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ)పై భూములు కొనుగోలు చేసి, వాటిని ఎక్కువ ధరకు విక్రయించి, మధ్యలో వచ్చే తేడా మొత్తాన్ని నగదుగా తీసుకునే విధానం అనుసరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఇదిలా ఉంటే, చిన్న పహిల్వాన్ కుటుంబ సభ్యుల ఆర్థిక లావాదేవీలపై కూడా ఐటీ శాఖ దృష్టి సారించింది. గచ్చిబౌలి ప్రాంతంలో వ్యాపారిగా, రాజకీయ నాయకుడిగా, రియల్ ఎస్టేట్ సెటిల్‌మెంట్లలో చురుకుగా వ్యవహరించే వ్యక్తిగా అతనికి పేరుంది.ప్రస్తుతం ఈ కేసుపై ఐటీ శాఖ దర్యాప్తు కొనసాగుతోంది. కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి వచ్చిన వెంటనే నమోదైన ఈ తొలి కేసు, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ ఆస్తులపై కఠిన చర్యలు కొనసాగుతాయని సంకేతాలిస్తోంది.





