నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేసిన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి

Must read

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న కీలక రహదారి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపడంతో పాటు జాతీయ రహదారిపై అసంపూర్తిగా ఉన్న సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరుతూ వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి గారు మంగళవారం కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.

ఈ సందర్భంగా హనుమకొండ జిల్లాలోని కరుణాపురం నుండి పెద్ద పెండ్యాల, నర్సింగరావుపల్లి, ఎలుకుర్తి, ధర్మసాగర్ మండల హెడ్‌క్వార్టర్, దేవునూర్, సోమ దేవరపల్లి, దామెర, ఎల్కతుర్తి మండల హెడ్‌క్వార్టర్ వరకు ఉన్న రోడ్డును విస్తరించి బలోపేతం చేయాల్సిన అవసరాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా ఈ రోడ్డు హైదరాబాద్ నుండి కరీంనగర్, సిద్ధి పేటకు వెళ్లే వాహనాలు వరంగల్ వెళ్లే అవసరం లేకుండా 163, 563 జాతీయ రహదారులను అనుసంధానించే కీలక మార్గమని, వేలాది మంది ప్రజలు, రైతులు, విద్యార్థులు, వ్యాపార వర్గాలు నిత్యం వినియోగిస్తున్నారని వివరించారు. పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా ఈ రహదారిని అభివృద్ధి చేయడం అత్యవసరమని పేర్కొన్నారు.

అలాగే యాదాద్రి–వరంగల్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-163) నాలుగు లైన్ల విస్తరణ సమయంలో పలు గ్రామాల్లో నిర్మించిన సర్వీస్ రోడ్ల మధ్య మిగిలిపోయిన లింకులను పూర్తి చేయాలని కోరారు. నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, ఘన్‌పూర్ స్టేషన్, చిన్నపెండ్యాల, కరుణాపురం గ్రామాల పరిధిలో సర్వీస్ రోడ్లు ఉన్నప్పటికీ వాటి మధ్య అనుసంధానం లేకపోవడంతో స్థానిక ప్రజలు ప్రధాన రహదారినే వినియోగించాల్సి వస్తోందని తెలిపారు. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలతో పాటు ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని వివరించారు. అవసరమైన భూమి ఇప్పటికే సేకరించిన నేపథ్యంలో మిగిలిన లింకుల నిర్మాణానికి వెంటనే ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా కేంద్ర రోడ్డు మరియు మౌలిక సదుపాయాల నిధి (సీఆర్‌ఐఎఫ్) 2025–26 కింద తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన అదనపు రహదారి అభివృద్ధి పనులకు ఆమోదం తెలపాలని కోరారు. నర్సంపేట–నందిగామ రహదారి విస్తరణ, భట్టుపల్లి–హంటర్ రోడ్ మార్గ అభివృద్ధి పనులు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు అమలైతే గ్రామీణ ప్రాంతాల అనుసంధానం మెరుగుపడటంతో పాటు వ్యవసాయ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడతాయని తెలిపారు.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక అవసరాలకు సంబంధించిన ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన ఆమోదం తెలపాలని ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. వినతులను సానుకూలంగా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!