తెలంగాణ అభివృద్ధికి కేంద్ర మంత్రులతో కీలక చర్చలు.. ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Must read

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ శక్తి (కార్మిక, శిక్షణ, ఉపాధి & ప్యాక్టరీస్) మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి సోమవారం న్యూఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, గనుల పురోగతి, మౌలిక వసతుల విస్తరణ, కార్మిక సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ముందుగా కేంద్ర కార్మిక & ఉపాధి శాఖ మంత్రి డా. మన్సుఖ్ మాండవీయను కలిసి తెలంగాణలో కార్మిక సంక్షేమ కార్యక్రమాల విస్తరణ, ఉపాధి అవకాశాల పెంపు, కేంద్ర పథకాల అమలులో రాష్ట్రానికి మరింత సహకారం అందించాలని కోరారు. అనంతరం కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ చౌదరిని కలిసి యువతకు అత్యాధునిక నైపుణ్య శిక్షణ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ల అభివృద్ధి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాల విస్తరణపై చర్చించారు.

తదనంతరం కేంద్ర బొగ్గు & గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని కలిసి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ఆలస్యం కాకుండా త్వరగా పూర్తి చేసి, స్థానిక యువతకు కనీసం వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. నిర్వాసిత కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద సమగ్ర పునరావాసం, పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని కూడా విజ్ఞప్తి చేశారు.

అదేవిధంగా సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ రూ.10 వేల పెన్షన్ అందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తక్కువ పెన్షన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేలాది మంది రిటైర్డ్ కార్మికుల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే సింగరేణి విస్తరణ, కొత్త బొగ్గు గనుల అభివృద్ధి, గనుల ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర సహకారం అందించాలని కోరారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా తాడిచెర్ల-2 ప్రాజెక్టు పనుల వేగవంతం, స్థానికులకు ఉద్యోగాల కల్పన, ఆర్‌అండ్‌ఆర్‌ అమలు, సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ అంశాలను సంబంధిత శాఖలతో చర్చించి అవసరమైన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ, “తెలంగాణ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల విస్తరణ, కార్మికుల సంక్షేమం, గనుల అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంగా పనిచేస్తాం. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ప్రతి అంశంపై నిరంతరం కృషి చేస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కట్టుబడి ఉన్నాం” అని పేర్కొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!