గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు: కిషన్ రెడ్డి

Must read

గ్రామీణాభివృద్ధిని వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. “సబ్కా సాత్, సబ్కా వికాస్” నినాదంతో ప్రతి గ్రామం సంపూర్ణ అభివృద్ధి సాధించేలా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.కేంద్రం తాజాగా విడుదల చేసిన నిధులలో రూ.371.91 కోట్లను గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించనున్నారు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణం, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ, బహిరంగ మలవిసర్జన రహిత (ODF) హోదా నిలుపుదల వంటి పనులకు ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. అదనంగా రూ.247.94 కోట్లను గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాల మేరకు స్థానిక అవసరాలకు ఖర్చు చేయనున్నారు.

15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం విడుదలైన ఈ నిధులను 10 పనిదినాల లోపు రాష్ట్ర ఆర్థిక శాఖ గ్రామ పంచాయతీలకు బదిలీ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆలస్యం జరిగితే, మార్కెట్ రుణాల వడ్డీ రేట్ల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వడ్డీతో కలిపి నిధులను విడుదల చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాటాను జమ చేయాల్సి ఉంటుంది.

గతంలో 14వ ఆర్థిక సంఘం కింద రాష్ట్రానికి రూ.5,060 కోట్ల నిధులు విడుదలయ్యాయి. అనంతరం 15వ ఆర్థిక సంఘం కింద ఈ కేటాయింపులు 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా 14వ, 15వ ఆర్థిక సంఘాల కాలంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.14,110 కోట్ల నిధులు కేటాయించబడ్డాయి.

ఈ క్రమంలో జనవరి 2026 నాటికి ఇప్పటికే రూ.11,111 కోట్ల నిధులు విడుదలయ్యాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పంచాయతీ ఎన్నికలు పూర్తైన తర్వాత జనవరి 2026 నుంచి రూ.1,032.42 కోట్లు విడుదలయ్యాయి. ప్రస్తుతం 2025–26 ఆర్థిక సంవత్సరానికి తొలి విడతగా రూ.619.85 కోట్లు విడుదలయ్యాయి.భవిష్యత్తు ప్రణాళికలపై కూడా మంత్రి స్పష్టత ఇచ్చారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం 2026–27 నుంచి 2030–31 మధ్య తెలంగాణ గ్రామ పంచాయతీలకు సుమారు రూ.9,968 కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

ఇక రాష్ట్ర రాజకీయాలపై కూడా కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు నిధులను సక్రమంగా విడుదల చేయలేదని ఆరోపించారు. కేంద్రం విడుదల చేసిన నిధులను దారిమళ్లించారని విమర్శించారు.

అదేవిధంగా, తెలంగాణలో రెండు సంవత్సరాల పాటు పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 2023–24, 2024–25 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధులు నిలిచిపోయాయని తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యాక మాత్రమే కేంద్రం ఆ నిధులను విడుదల చేసిందని స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!