గాంధీభవన్ కు రావొద్దు.. జనంలో తిరగండి :నేతలకు సీఎం రేవంత్ రెడ్డి హుకుం

Must read

ప్రజల మధ్య ఉండండి.. గాంధీభవన్‌కు రావద్దు..” అంటూ కాంగ్రెస్ శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా రేపటి నుంచి ఆగస్టు 3 వరకు ప్రతి నాయకుడు నియోజకవర్గంలోనే ఉండాలని ఆదేశించారు. పనితీరు బాగోలేని నియోజకవర్గాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే, పదవుల కోసం పైరవీలు చేసే నేతలకు తలుపులు మూసేయాలని సూచించారు.

కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రేపటి (జూలై 20) నుంచి ఆగస్టు 3 వరకు పార్టీ నాయకులంతా పూర్తిగా క్షేత్రస్థాయిలోనే ఉండాలని, ఈ వ్యవధిలో గాంధీభవన్‌కు రావొద్దని ఆదేశించారు. ఆదివారం కాంగ్రెస్ నేతలతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఆయన ఈ మేరకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

నాయకులంతా ఎన్నికల ప్రచారం తరహాలో గ్రామాలు, వార్డులు, బూత్‌లలో విస్తృతంగా పర్యటించాలని సీఎం సూచించారు. కొందరు నాయకులు హైదరాబాద్‌లోనే ఉండి పార్టీ పనులను నిర్లక్ష్యం చేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ పదవుల కోసం పైరవీలు చేయడం ఇకపై సహించబోమని హెచ్చరించారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరిగే వారికి అపాయింట్‌మెంట్లు ఇవ్వొద్దని పార్టీ నాయకత్వానికి స్పష్టం చేశారు.

ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో దానిని కాంగ్రెస్ పార్టీకి అవకాశంగా మలచుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఆధ్వర్యంలో 489 సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. పనితీరు వెనుకబడిన నియోజకవర్గాల్లో నాయకులు వెంటనే చురుగ్గా పనిచేయాలని ఆదేశించారు.

సోమవారం నుంచి పది మంది ఇన్‌చార్జ్ మంత్రులు అన్ని జిల్లాల్లో ఎస్‌ఐఆర్‌పై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న ఎంపీలు కూడా తమకు అప్పగించిన నియోజకవర్గాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న ప్రాంతాల్లో ఎంపీలు ఆశించిన స్థాయిలో పనిచేయకపోతే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

బీఎల్‌ఓల నివేదికల కంటే పార్టీ నియమించిన బీఎల్‌ఏల నివేదికలనే ప్రధానంగా పరిగణించాలని సీఎం స్పష్టం చేశారు. బీఎల్‌ఓల సమాచారంపై మాత్రమే ఆధారపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఎల్‌ఏలను సమర్థంగా వినియోగించుకోవాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జులు, కార్పొరేషన్ చైర్మన్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. బీఎల్‌ఏ, బీఎల్‌ఓ నివేదికలను గాంధీభవన్ బృందం నిరంతరం పరిశీలించాలని చెప్పారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ఇన్‌చార్జ్ మంత్రులదే పూర్తి బాధ్యత అని తేల్చిచెప్పిన సీఎం, ఈ నెల 30న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మరోసారి సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమన్వయ బాధ్యతలను మరింత సమర్థంగా నిర్వర్తించాలని సూచించారు. అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి ఫొటో దిగే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

సమావేశంలో నియోజకవర్గాల పనితీరుపై సమగ్ర నివేదికను కూడా సీఎం పరిశీలించారు. అలంపూర్, ఆర్మూర్, ఆసిఫాబాద్, బహదూర్‌పూర్ నియోజకవర్గాల్లో పార్టీ కార్యకలాపాలు అత్యంత బలహీనంగా ఉన్నాయని నివేదికలో తేలడంతో సంబంధిత ఇన్‌చార్జీలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు 52 నియోజకవర్గాల్లో పనితీరు బాగుందని, 42 నియోజకవర్గాల్లో మధ్యస్థంగా ఉందని, 21 నియోజకవర్గాల్లో ఇంకా మెరుగుదల అవసరమని పేర్కొన్నారు. పనితీరు సరిగా లేని నాయకులపై అవసరమైతే కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడబోమని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!