దేశ రాజకీయాల్లో ప్రతిపక్షాల ఐక్యతకు ప్రతీకగా భావిస్తున్న ఇండియా కూటమి కీలక సమావేశం జరుగుతున్న సమయంలో ఢిల్లీలో వెలుగులోకి వచ్చిన కొన్ని వివాదాస్పద పోస్టర్లు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష కూటమి భవిష్యత్ కార్యాచరణ, ఐక్యత, వ్యూహాలపై కీలక చర్చలు సాగుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీని లక్ష్యంగా చేసుకుని ఏర్పాటు చేసిన పోస్టర్లు రాజకీయ వేడిని మరింత పెంచాయి.
దేశ రాజధానిలోని పలు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. పోస్టర్లలో రాహుల్ గాంధీ నాయకత్వంపై ప్రశ్నలు లేవనెత్తడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై ప్రాంతీయ పార్టీలు పూర్తిగా ఆధారపడబోవని సూచించే వ్యాఖ్యలు ఉండటం గమనార్హంగా మారింది. ముఖ్యంగా ప్రతిపక్ష కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్న నేతల ఫొటోలను కూడా ఈ పోస్టర్లలో ఉపయోగించడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఢిల్లీలో కనిపించిన ఈ పోస్టర్లలో రాహుల్ గాంధీ రాజకీయ స్థిరత్వంపై సందేహాలు వ్యక్తం చేసినట్లు కనిపిస్తోంది. అలాగే ప్రతిపక్ష కూటమిలోని ప్రాంతీయ పార్టీలే కాంగ్రెస్‌పై పూర్తిగా ఆధారపడే పరిస్థితిలో లేవని సూచించే సందేశాలు అందులో ముద్రించబడ్డాయి.
పోస్టర్లలో శారద్ పవర్, M. K. స్టాలీన్, అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్జీ వంటి ప్రముఖ నేతల చిత్రాలను ఉపయోగించారు. దీంతో ఈ పోస్టర్ల వెనుక రాజకీయ ఉద్దేశ్యం ఏమిటనే చర్చ మొదలైంది. యితే ఈ పోస్టర్లను ఎవరు ఏర్పాటు చేశారు? వాటి వెనుక ఏ రాజకీయ శక్తి ఉంది? అనే విషయాలపై ఇప్పటివరకు అధికారిక సమాచారం వెలువడలేదు. దీనిపై రాజకీయ వర్గాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
మరోవైపు, ఇండియా కూటమి సమావేశం మాత్రం ప్రతిపక్ష ఐక్యతను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. రానున్న ఎన్నికలు, దేశ రాజకీయ పరిస్థితులు, కూటమి వ్యూహాలు, ప్రాంతీయ పార్టీలతో సమన్వయం వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిగినట్లు సమాచారం.
ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లీకార్జున ఖర్గే హాజరయ్యారు. అలాగే మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్ , తేజశ్విన్ యాదవ్ తదితర ప్రముఖులు సమావేశంలో పాల్గొన్నారు. ఉదయ్ Thackeray వర్చువల్‌గా సమావేశంలో పాల్గొన్నట్లు తెలిసింది.
ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయాయి. మరోవైపు కూటమిలో భాగస్వామ్య పార్టీల మధ్య కొన్ని అంశాలపై విభేదాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కూటమి ఐక్యతను కాపాడుకోవడం, సమన్వయాన్ని మరింత మెరుగుపరచడం ప్రధాన లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది.
ప్రత్యేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగేందుకు ఏ విధమైన రాజకీయ కార్యాచరణ రూపొందించాలన్న అంశంపై నేతలు విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తూ భవిష్యత్ ఎన్నికల కోసం కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంపై దృష్టి సారించారు.





