ప్రజ్ఞానందకు సీఎం విజయ్ సత్కారం

Must read

భారత చెస్ చరిత్రలో మరో స్వర్ణ అధ్యాయాన్ని లిఖించిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానందన్​ కు తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం నిర్వహించింది. ప్రతిష్ఠాత్మకమైన నార్వే చెస్​ 2026 టోర్నమెంట్‌లో చారిత్రాత్మక విజయాన్ని సాధించిన ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి సి. విజయ్​ సేతుపతి సోమవారం చెన్నైలోని సచివాలయంలో అభినందించి రూ.50 లక్షల నగదు పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ప్రజ్ఞానందతో చెస్ ఆడి అందరినీ ఆకట్టుకున్నారు.

భారత చెస్ ప్రపంచానికి చెందిన అత్యంత ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లలో ప్రజ్ఞానంద ఒకరు. చిన్న వయసులోనే గ్రాండ్‌మాస్టర్ హోదా సాధించి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఆయన, ఇప్పుడు నార్వే చెస్ టైటిల్‌ను గెలుచుకుని మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. ఓస్లో వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్లను అధిగమిస్తూ విజేతగా నిలవడం భారత చెస్‌కు గర్వకారణంగా మారింది.

ఈ విజయంతో ప్రజ్ఞానంద నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. 2013లో ప్రారంభమైన ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారతదేశానికి చెందిన ఏ ఆటగాడు కూడా ఇప్పటివరకు విజేతగా నిలవలేదు. ప్రపంచ చెస్ దిగ్గజం విశ్వనాథన్​ ఆనందన్​ సైతం సాధించలేని ఘనతను ప్రజ్ఞానంద తన పేరుపై లిఖించుకోవడం విశేషంగా మారింది.

టోర్నీలో ప్రజ్ఞానంద ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా ప్రపంచ నంబర్-1 ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్‌పై క్లాసికల్ ఫార్మాట్‌లో రెండుసార్లు విజయం సాధించడం చెస్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కార్ల్‌సెన్ సొంతగడ్డపై, అతడి అభిమానుల మధ్య ఈ విజయాలు నమోదు చేయడం ప్రజ్ఞానంద ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ D. గుకేష్​ పై కూడా కీలక విజయాన్ని సాధించి టైటిల్ రేసులో ఆధిపత్యాన్ని చాటాడు.

ప్రజ్ఞానంద విజయాన్ని గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక సత్కారం నిర్వహించింది. రాష్ట్ర క్రీడాభివృద్ధి సంస్థ తరఫున రూ.50 లక్షల నగదు బహుమతిని అందజేస్తూ ముఖ్యమంత్రి విజయ్ ఆయనను అభినందించారు. దేశానికి, రాష్ట్రానికి అంతర్జాతీయ వేదికపై గౌరవం తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. యువతకు ప్రజ్ఞానంద ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

సత్కార కార్యక్రమంలో జరిగిన మరో ఆసక్తికర ఘట్టం అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యమంత్రి విజయ్, ప్రజ్ఞానందతో చెస్ బోర్డు ముందు కూర్చుని కొంతసేపు ఆట ఆడారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చెస్‌పై తనకున్న ఆసక్తిని విజయ్ ప్రదర్శించగా, ప్రజ్ఞానంద కూడా ఎంతో ఉత్సాహంగా స్పందించారు. ఈ సరదా మ్యాచ్ కార్యక్రమానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

ప్రజ్ఞానంద విజయంతో భారత చెస్ భవిష్యత్తు మరింత ఉజ్వలంగా కనిపిస్తోందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల గుకేశ్ ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించడం, భారత యువ గ్రాండ్‌మాస్టర్లు అంతర్జాతీయ వేదికలపై వరుస విజయాలు నమోదు చేయడం దేశంలో చెస్ క్రీడ అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రజ్ఞానంద సాధించిన ఈ విజయం మరెంతో మంది యువ క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!