భారత ప్రధాని నరేంద్రమోడీ తనకు బహూకరించిన అరుదైన వజ్రాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని భావించానని, అయితే అమెరికా ప్రభుత్వ నిబంధనల కారణంగా చివరికి దానిని తిరిగి అప్పగించాల్సి వచ్చిందని అమెరికా మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్ వెల్లడించారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఆమె ఆత్మకథ ‘వ్యూ ఫ్రమ్ ద ఈస్ట్ వింగ్: ఎ మెమోయిర్’ View from the East Wing: A Memoirలో వైట్ హౌస్‌లో గడిపిన అనుభవాలతో పాటు విదేశీ నాయకుల నుంచి అందుకునే బహుమతులపై అమల్లో ఉన్న కఠిన నిబంధనల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
2023 జూన్‌లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా అధ్యక్ష దంపతులను కలిసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో మోదీ, జిల్ బైడెన్‌కు భారతదేశంలో అత్యాధునిక స్వదేశీ సాంకేతికతతో తయారు చేసిన 7.5 క్యారెట్ల ల్యాబ్-గ్రోన్ వజ్రాన్ని బహుమతిగా అందించారు. ఈ వజ్రం భారతదేశం ల్యాబ్-గ్రోన్ డైమండ్ రంగంలో సాధించిన సాంకేతిక పురోగతికి ప్రతీకగా భావించబడింది.
తన ఆత్మకథలో జిల్ బైడెన్ ఆ బహుమతి గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఆ వజ్రం నిజంగా అద్భుతంగా అనిపించింది. ల్యాబ్-గ్రోన్ వజ్రాల తయారీలో భారత్ సాధించిన అభివృద్ధికి అది ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆ బహుమతి నన్ను ఎంతో ఆకట్టుకుంది” అని ఆమె రాసుకొచ్చారు. అంతేకాకుండా, ఆ వజ్రాన్ని తన వద్దే ఉంచుకోవాలని కూడా ఒక దశలో భావించినట్లు వెల్లడించారు.
అయితే అమెరికా ప్రభుత్వ నైతిక నిబంధనల ప్రకారం విదేశీ నాయకులు అందించే ఖరీదైన బహుమతులను ప్రభుత్వ అధికారుల వ్యక్తిగత ఆస్తిగా ఉంచుకోవడానికి అనుమతి ఉండదు. ముఖ్యంగా నిర్దిష్ట విలువకు మించిన బహుమతులు అమెరికా ప్రభుత్వ ఆస్తిగా నమోదు చేయబడతాయి. ఈ కారణంగానే మోదీ అందించిన విలువైన వజ్రాన్ని కూడా తాను వ్యక్తిగతంగా ఉంచుకోలేకపోయానని జిల్ బైడెన్ పేర్కొన్నారు.
వైట్ హౌస్‌లో నివసించే సమయంలో ప్రపంచ దేశాల నాయకుల నుంచి ఎన్నో ప్రత్యేక బహుమతులు అందేవని, కానీ వాటిలో చాలా వరకు వ్యక్తిగతంగా తమ వద్ద ఉండేవి కాదని ఆమె వివరించారు. విదేశీ పర్యటనలు, దౌత్య సమావేశాల సందర్భంగా అందుకునే బహుమతులన్నీ ప్రత్యేక నిబంధనల ప్రకారం నమోదు చేయబడతాయని, వాటి విలువ ఆధారంగా ప్రభుత్వ భద్రపరిచే కేంద్రాలకు తరలిస్తారని చెప్పారు.
మోదీ బహుమతిగా ఇచ్చిన ల్యాబ్-గ్రోన్ వజ్రం భారత్‌కు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తీసుకొచ్చిన అంశంగా అప్పట్లో కూడా చర్చనీయాంశమైంది. సహజ వజ్రాలతో సమాన నాణ్యత కలిగి ఉండే ఈ కృత్రిమ వజ్రాల తయారీలో భారత్ ప్రపంచవ్యాప్తంగా కీలక స్థానాన్ని సంపాదిస్తోంది. పర్యావరణహిత సాంకేతికతతో తయారయ్యే ఈ వజ్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది.
జిల్ బైడెన్ తాజా వ్యాఖ్యలు మరోసారి భారత-అమెరికా దౌత్య సంబంధాలపై దృష్టిని కేంద్రీకరించాయి. ఒక బహుమతి వెనుక ఉన్న సాంకేతికత, దాని ప్రతీకాత్మకత తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని ఆమె చెప్పడం విశేషం. అదే సమయంలో, ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు పాటించాల్సిన నైతిక ప్రమాణాల గురించి కూడా ఆమె తన ఆత్మకథ ద్వారా ప్రస్తావించారు.





