నువ్వు తెలుగోడివా..? తమిళోడివా..? : ప్రకాష్​ రాజ్​కు బండ్ల గణేష్​ సూటి ప్రశ్న

Must read

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్​ కళ్యాణ్​ ను ఉద్దేశించి ప్రముఖ నటుడు ప్రకాష్​ రాజ్​ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్​ తీవ్రస్థాయిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా ఇద్దరి మధ్య పరోక్షంగా ప్రారంభమైన ఈ మాటల యుద్ధం ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లోకి జనసేన పార్టీ ప్రవేశం గురించి పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన చేసిన పోస్ట్‌లో, “వస్తానంటే వద్దంటామా.. రండి సార్. కానీ అంతకంటే ముందు ఒకటి చెప్పండి. మీరు పొత్తుతో వస్తున్నారా? లేక సింగిల్‌గా వస్తున్నారా? ఊరికే అడుగుతున్నా” అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తనకు గుర్తింపుగా మారిన జస్ట్ ఆస్కింగ్​ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా జత చేశారు.

ప్రకాశ్ రాజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు రాజకీయ చర్చలకు దారితీసింది. జనసేన అధినేత తెలంగాణ రాజకీయాల్లో పోటీ చేస్తామన్న ప్రకటన నేపథ్యంలో వచ్చిన ఈ వ్యాఖ్యలు పరోక్షంగా పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించినవేనని పలువురు అభిప్రాయపడ్డారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన బండ్ల గణేశ్ అదే సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రకాశ్ రాజ్‌ను నేరుగా ఉద్దేశిస్తూ వరుస ప్రశ్నలు సంధించారు. “నీకెందుకు ప్రతి దాంట్లో వేలుపెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతి అంశంలో దూరి తీర్పులు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్‌వా లేక దేశ ప్రధానివా?” అంటూ ప్రశ్నించారు.

అంతేకాకుండా, “ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే. పని లేకపోతే చూసుకో. కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీలవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో. తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్” అంటూ బండ్ల గణేశ్ తన పోస్ట్‌లో ఘాటుగా స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి.

బండ్ల గణేశ్ పవన్ కల్యాణ్‌కు అత్యంత సన్నిహితుడిగా, అభిమానిగా పేరుగాంచిన విషయం తెలిసిందే. గతంలో కూడా పవన్ కల్యాణ్‌పై విమర్శలు వచ్చిన సందర్భాల్లో ఆయన బహిరంగంగా స్పందిస్తూ మద్దతు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించడం రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.

మరోవైపు ప్రకాశ్ రాజ్ కూడా రాజకీయ, సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను నిర్భయంగా వ్యక్తం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందారు. గతంలోనూ పలు రాజకీయ అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కల్యాణ్, జనసేన పార్టీ రాజకీయ నిర్ణయాలపై ఆయన అప్పుడప్పుడూ విమర్శనాత్మకంగా స్పందిస్తూ ఉంటారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!