స్వయం ప్రకటిత ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు రాజస్థాన్ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో కింది కోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను సమర్థించింది. రాజాస్థాన్ హైకోర్టు ఆశారాం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది.
ప్రస్తుతం మధ్యంతర వైద్య బెయిల్‌పై బయట ఉన్న 86 ఏళ్ల ఆశారాం వెంటనే సంబంధిత అధికారుల ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఇదే కేసులో సహ నిందితులుగా ఉన్న శిల్పి, శరత్‌చంద్‌లను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు విముక్తి కల్పించింది.
జస్టిస్ అరుణ్ మోంగా, జస్టిస్ యోగేంద్ర కుమార్ పురోహిత్‌లలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 2013 ఆగస్టులో జోదాపూర్ లోని ఆశారాం ఆశ్రమంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో కేసు విస్తృత చర్చకు దారితీసింది.
సుదీర్ఘ విచారణ అనంతరం 2018 ఏప్రిల్ 25న జోధ్‌పూర్‌లోని ప్రత్యేక పోక్సో కోర్టు ఆశారాంను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. బాధితురాలి వాంగ్మూలం, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలు తదితర అంశాల ఆధారంగా కోర్టు ఈ తీర్పు ఇచ్చింది. అనంతరం ఆశారాం ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ అప్పీల్‌పై హైకోర్టు 2026 ఫిబ్రవరి 16 నుంచి ఏప్రిల్ 20 వరకు రోజువారీ విచారణ జరిపింది. ఇరుపక్షాల వాదనలు, సాక్ష్యాలు, చట్టపరమైన అంశాలను పరిశీలించిన అనంతరం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తుది తీర్పు వెలువరిస్తూ కింది కోర్టు ఇచ్చిన జీవిత ఖైదు శిక్షను యథాతథంగా కొనసాగించింది.
ఈ కేసు భారతదేశంలో ఆధ్యాత్మిక గురువులపై నమోదైన అత్యంత ప్రాధాన్యమైన క్రిమినల్ కేసుల్లో ఒకటిగా పరిగణించబడుతోంది. ఆశారాం బాపూ దేశవ్యాప్తంగా పెద్దఎత్తున అనుచరులను కలిగి ఉండటంతో ఈ కేసు రాజకీయ, సామాజిక, న్యాయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది.
విచారణ సమయంలో బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలం కేసులో కీలకంగా మారింది. మరోవైపు ఆశారాం తరఫు న్యాయవాదులు ఆరోపణలు నిరాధారమని వాదించినప్పటికీ, కోర్టు ఆ వాదనలను అంగీకరించలేదు. కింది కోర్టు తీర్పులో ఎలాంటి లోపాలు లేవని హైకోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం.
ప్రస్తుతం ఆశారాం ఆరోగ్య కారణాలతో మధ్యంతర వైద్య బెయిల్‌పై ఉన్నారు. అయితే తాజా తీర్పుతో ఆయన మళ్లీ జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెంటనే అధికారుల ఎదుట లొంగిపోవాలని కోర్టు ఆదేశించడంతో పోలీసులు తదుపరి చర్యలకు సిద్ధమవుతున్నారు.
ఇక సహ నిందితులుగా ఉన్న శిల్పి, శరత్‌చంద్‌లకు కోర్టు ఉపశమనం కల్పించింది. వారిపై ఉన్న ఆరోపణలకు సరిపడా ఆధారాలు లేవని పేర్కొంటూ నిర్దోషులుగా ప్రకటించింది.
న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ తీర్పు పోక్సో కేసుల విచారణలో కీలక మైలురాయిగా పరిగణించవచ్చు. బాధితుల వాంగ్మూలం, సాక్ష్యాధారాల ప్రాధాన్యతను ఈ కేసు మరోసారి స్పష్టం చేసిందని వారు చెబుతున్నారు.
ఈ తీర్పు వెలువడిన తర్వాత దేశవ్యాప్తంగా మళ్లీ ఆశారాం కేసుపై చర్చ మొదలైంది. మహిళల భద్రత, ఆధ్యాత్మిక సంస్థల బాధ్యత, చట్టపరమైన వ్యవస్థపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరుగుతోంది.





