బండి సంజయ్ కుమారు కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసు విచారణ జరుపుతున్న హైకోర్టు న్యాయమూర్తిపై సోషల్ మీడియా వేదికగా జరిగిన అనుచిత ప్రచారాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకుంది. న్యాయవ్యవస్థ గౌరవాన్ని దెబ్బతీసేలా పోస్టులు వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్వేత ఆధ్వర్యంలో ఈ సిట్ పని చేయనుంది. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందిన పోస్టుల వెనుక ఉన్న వ్యక్తులు, ఐటీ సెల్స్, నకిలీ అకౌంట్లు, ప్రచార నెట్వర్క్‌లను పూర్తిగా గుర్తించి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ జస్టిస్ టీ మాధవి దేవి ధర్మాసనం ముందుకు వచ్చింది. విచారణ కొనసాగుతున్న సమయంలోనే సోషల్ మీడియాలో వివాదాస్పద ప్రచారం ప్రారంభమైంది.
కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్, ఐటీ సెల్స్ ద్వారా జస్టిస్ మాధవి దేవిని లక్ష్యంగా చేసుకుని అసత్య ఆరోపణలతో కూడిన పోస్టులు వైరల్ అయ్యాయి. బండి భగీరథ్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దానికి ప్రతిఫలంగా ఆమె భర్తకు బార్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తూ పోస్టులు ప్రచారం చేశారు.
ఈ పోస్టులు కొద్ది గంటల్లోనే విస్తృతంగా షేర్ కావడంతో న్యాయవర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కావాలనే దుష్ప్రచారం నిర్వహించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారాన్ని న్యాయవాదుల సంఘాలు, న్యాయవర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. విచారణలో ఉన్న కేసులను ప్రభావితం చేయడం కోసం న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం అత్యంత ప్రమాదకర పరిణామమని పేర్కొంటున్నారు.
ప్రత్యేకంగా న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే ప్రయత్నాలను కఠినంగా అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత ఆరోపణలు చేసి న్యాయమూర్తులపై ఒత్తిడి తీసుకురావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు.
సిట్ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే పలు సోషల్ మీడియా అకౌంట్ల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. పోస్టులు మొదట ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు వాటిని వైరల్ చేశారు? రాజకీయ లేదా ఇతర సంస్థల ప్రమేయం ఉందా? అనే అంశాలపై అధికారులు దృష్టి సారించారు.
అలాగే వివాదాస్పద పోస్టులు షేర్ చేసిన ఖాతాల ఐపీ అడ్రస్‌లు, ఫోన్ నంబర్లు, డిజిటల్ ట్రయిల్‌ను కూడా పరిశీలించనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే సోషల్ మీడియా సంస్థల సహకారంతో ఖాతాదారుల వివరాలు సేకరించే అవకాశం ఉంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. న్యాయవ్యవస్థపై తప్పుడు ప్రచారం చేసిన వారిపై ఐటీ చట్టాలు, క్రిమినల్ చట్టాల కింద కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.
ఈ ఘటన తెలంగాణ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. సోషల్ మీడియా దుష్ప్రచారం వెనుక రాజకీయ ప్రయోజనాలున్నాయా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. కొంతమంది నేతలు న్యాయవ్యవస్థను రాజకీయ వివాదాల్లోకి లాగడం సరైంది కాదని అంటుండగా.. మరికొందరు సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన నియంత్రణలు అవసరమని అభిప్రాయపడుతున్నారు.





