మహారాష్ట్రలోని పుణే నగరంలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తిని నమ్మి కలవడానికి వెళ్లిన ఓ మహిళా న్యాయవాదిపై కదులుతున్న కారులో సామూహిక లైంగిక దాడి జరిగింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై మహిళా సంఘాలు, న్యాయవాదుల సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌లోని పాట్నాకు చెందిన బాధిత మహిళ పుణేలో న్యాయ విద్య పూర్తి చేసి ప్రస్తుతం బాంబే హైకోర్టులో లాయర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నారు. వృత్తి సంబంధిత పనుల నిమిత్తం ఇటీవల ఆమె పుణేకు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రముఖ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఆమెను కోరేగావ్ పార్క్‌లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆహ్వానించాడు.
ఆ వ్యక్తి తనతో పాటు మరో ఇద్దరు మహిళలను కూడా తీసుకువచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. హోటల్‌లో కొంతసేపు అందరూ సాధారణంగా మాట్లాడుకున్నారని, ఆ తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని అధికారులు చెబుతున్నారు. బాధితురాలు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, నిందితులు మాయమాటలు చెప్పి ఆమెను కారులో తీసుకెళ్లినట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో బయటపడిన వివరాలు కలవరపెడుతున్నాయి. బాధితురాలిని కారులో బలవంతంగా తీసుకెళ్లిన నిందితులు, నగర పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలు ప్రతిఘటించినప్పటికీ బెదిరింపులకు గురిచేసి అమానుషంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.
ఘటన అనంతరం తీవ్ర షాక్‌కు గురైన మహిళ.. ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో కేసు వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా వెంటనే కేసు నమోదు చేసిన పుణే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, మొబైల్ ఫోన్ కాల్ డేటా, హోటల్ రికార్డుల ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించారు.
ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నిందితులపై సామూహిక అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపులు, మహిళ గౌరవానికి భంగం కలిగించడం వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
పోలీసుల విచారణలో నిందితులు బాధితురాలిని ముందే టార్గెట్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్లను ఉపయోగించి మహిళలను మోసం చేసే గ్యాంగ్‌లపై కూడా పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం.
ఈ ఘటనపై రాజకీయ నాయకులు, న్యాయవాదుల సంఘాలు స్పందిస్తూ నిందితులను ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించి త్వరితగతిన శిక్షించాలని కోరుతున్నారు. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వాలు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.





