సుప్రీంకోర్టు ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల ఎంపిక విధానంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎక్కడ ఉందని జస్టిస్ దీపాంకర్ దత్తా ప్రశ్నించారు. ప్రస్తుతం ప్రధానమంత్రి, లోక్‌సభ ప్రతిపక్ష నేత, కేంద్ర క్యాబినెట్ మంత్రి సభ్యులుగా ఉన్న కమిటీ నియామకాలపై నిర్ణయం తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఈ నియామక ప్రక్రియ రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు సంధించింది. సీబీఐ డైరెక్టర్ నియామక కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సభ్యుడిగా ఉన్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టే ఎన్నికల సంఘం నియామక కమిటీలో ఎందుకు ఉండకూడదని ప్రశ్నించింది.
అయితే ప్రధాన న్యాయమూర్తినే కమిటీలో ఉండాలని తాము చెప్పడం లేదని, కనీసం ఒక స్వతంత్ర సభ్యుడు అయినా ఉండాల్సిన అవసరం లేదా అని ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం స్వతంత్రత కేవలం వ్యవస్థలోనే కాకుండా ప్రజలకు కూడా స్పష్టంగా కనిపించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది.
విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణిను ప్రశ్నిస్తూ.. ప్రధానమంత్రి ఒక అభ్యర్థిని సూచిస్తే, ప్రతిపక్ష నేత మరో వ్యక్తిని సూచించే అవకాశం ఉంటుందని, అటువంటి పరిస్థితిలో మూడో సభ్యుడైన క్యాబినెట్ మంత్రి ప్రతిపక్ష నేతకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయని ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా అటార్నీ జనరల్ మాట్లాడుతూ, ప్రతి సందర్భంలో ఒకే విధంగా వ్యవహారం ఉండకపోవచ్చని పేర్కొన్నారు. అయితే ప్రధానమంత్రి నిర్ణయానికి క్యాబినెట్ మంత్రి వ్యతిరేకించే అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో 2:1 మెజారిటీతో నిర్ణయం జరిగిపోతుందని జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు.
ప్రస్తుత వ్యవస్థలో ప్రతిపక్ష నాయకుడి పాత్ర కేవలం ‘అలంకారప్రాయం’గా మారిపోయిందని ధర్మాసనం పేర్కొంది. ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రజల్లో విశ్వాసం పెరగాలంటే నియామక ప్రక్రియ పారదర్శకంగా, సమతుల్యంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.
ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు వచ్చే వారానికి వాయిదా వేసింది.




