కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టులో గురువారం వాడివేడి వాదనలు జరిగాయి. భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కీలక వాదనలు వినిపించారు.
- ఈ కేసులో బాధితురాలు అసలు మైనర్ కాదని, అందువల్ల పోక్సో చట్టం వర్తించదని కోర్టుకు తెలిపారు. గతంలో బాధితురాలిపై నమోదైన మరో కేసులో పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో ఆమెను మేజర్‌గా పేర్కొన్నారని వాదించారు.
బాధితురాలికి సంబంధించి రెండు వేర్వేరు జనన తేదీ ధ్రువపత్రాలు ఉన్నాయని, వాటిలో పుట్టిన తేదీలు భిన్నంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కేసులో మరో తేదీని ప్రస్తావిస్తున్నారని, అసలు ఏ తేదీ సరైందో కోర్టే నిర్ణయించాల్సి ఉంటుందని తెలిపారు.
భగీరథ్ నిర్దోషి అని నిరూపించే పలు ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని సీల్డ్ కవర్లో సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు వెల్లడించారు. ఈ ఆధారాలను సమర్పించే అవకాశం ఇవ్వాలని కోరారు.
భగీరథ్ ఎలాంటి ప్రత్యేక హక్కులు కోరడం లేదని, అయితే ఈ కేసును సాధారణ కేసుల మాదిరిగా చూడకూడదని నిరంజన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. భగీరథ్ తండ్రి కేంద్ర మంత్రిగా ఉండటంతో రాజకీయ, సామాజిక ఒత్తిడులు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
వాల్ పోస్టర్లు, మెట్రో రైళ్లలో ప్రచారాలు చేస్తూ భగీరథ్‌ను దోషిగా చిత్రీకరిస్తున్నారని, సోషల్ మీడియా ద్వారా కూడా దుష్ప్రచారం సాగుతోందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయకముందే మీడియా ట్రయల్స్ ద్వారా నిందితుడిని శిక్షించే ప్రయత్నం జరుగుతోందని వాదించారు.
భగీరథ్‌కు మధ్యంతర రక్షణ కల్పిస్తే విచారణకు పూర్తిగా సహకరిస్తారని, తమ వద్ద ఉన్న సాక్ష్యాలను పోలీసుల ముందుంచేందుకు అవకాశం కల్పించాలని కోర్టును కోరారు. మధ్యంతర రక్షణ లేకపోతే ముందస్తు బెయిల్ పిటిషన్ ప్రయోజనం లేకుండా పోతుందని, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే అవకాశాన్ని కోల్పోతారని తెలిపారు.
వాదనలు విన్న హైకోర్టు భగీరథ్‌కు మధ్యంతర రక్షణ కల్పించే అంశంపై ఉత్తర్వులను శుక్రవారానికి వాయిదా వేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.





