ఆక్టోపస్ పనితీరును సమీక్షించిన డిజిపి శ్రీ సివి ఆనంద్

Must read

రాష్ట్రంలోని కౌంటర్ టెర్రర్ ఫోర్స్ ‘అక్టోపస్’ పనితీరు, శిక్షణ కార్యకలాపాలు మరియు ఆపరేషనల్ సన్నద్ధతను రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ శ్రీ సివి ఆనంద్ గురువారం క్షుణ్ణంగా సమీక్షించారు. ఇబ్రహీంపట్నంలోని అక్టోపస్ కమాండో శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన డిజిపి క్యాంపస్‌లోని అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, శిక్షణ విభాగం, ఆపరేషనల్ సౌకర్యాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా కమాండోలు, అధికారులతో ముఖాముఖి మాట్లాడి, ఏవైనా అవాంఛనీయ ఉగ్రవాద సంఘటనలు ఎదురైతే వాటిని తిప్పికొట్టేందుకు సన్నద్ధత గురించి అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్ (స్వాట్) బృందాల పనితీరును, శిక్షణ విభాగాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆపరేషన్స్ (అక్టోపస్ & గ్రేహౌండ్స్) డిజి డాక్టర్ అనిల్ కుమార్ ఈ సందర్భంగా డిజిపి కి పలు అంశాలపై వివరణ ఇచ్చారు.

ఆపరేషనల్ టీమ్స్ నిర్వహిస్తున్న రెగ్యులర్ కార్యకలాపాలు, కీలక సంస్థలు మరియు సున్నిత ప్రాంతాల్లో కాలానుగుణంగా చేపడుతున్న మాక్ ఎక్సర్‌సైజులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాట విన్యాసాలు మరియు అత్యాధునిక ఆయుధాల వినియోగంలో కమాండోలకు ఇస్తున్న ప్రత్యేక శిక్షణ గురించి వివరించారు.

అనంతరం అధికారులను ఉద్దేశించి డిజిపి శ్రీ సివి ఆనంద్ మాట్లాడుతూ.. …కార్యకలాపాల సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి వివిధ రకాల భవన సముదాయాలు, వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే రీతిలో మాక్ ఆపరేషన్లు నిర్వహించడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. కమాండోలు శారీరక దృఢత్వంలో అత్యున్నత ప్రమాణాలు పాటించాలని, ఎల్లప్పుడూ నిశితమైన అప్రమత్తతతో ఉంటూ 24 గంటలూ విధులకు సిద్ధంగా ఉండాలని సూచించారు.

అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి అవసరమైన అత్యాధునిక పరికరాల సేకరణ, మౌలిక సదుపాయాల బలోపేతంపై డిజిపి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాలతో పాటు భవిష్యత్తులో రాబోయే విమానాశ్రయాల భద్రతను దృష్టిలో ఉంచుకుని కార్యకలాపాల వ్యూహాలను పటిష్టం చేయాలని ఆదేశించారు.

గ్రేహౌండ్స్ , అక్టోపస్ దళాలు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణమని, వాటి వృత్తి నైపుణ్యం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని ఆయన కొనియాడారు. ఈ దళాల సామర్థ్యాన్ని మరింత పెంపొందించేందుకు ప్రభుత్వం, పోలీస్ శాఖ నుంచి పూర్తి స్థాయి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో ఎస్పీ (అడ్మిన్) ఎం. వెంకటేశ్వర్లు, అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) సి.హెచ్. రఘునందన్ మరియు ఇతర అక్టోపస్ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!