దేశంలోనే తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం..

Must read

తెలంగాణలో ధరల మంట కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో ఎండల తీవ్రతతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరగడంతో ప్రజలపై అదనపు భారం పడింది. దేశవ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, తెలంగాణలో అది మరింత ఎక్కువగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం దేశంలోనే అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైంది.

మంగళవారం ఎన్‌ఎస్‌ఓ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణలో వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్ నెలలో 5.81 శాతానికి చేరుకుంది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అత్యధిక స్థాయి కావడం గమనార్హం. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్​లో ఇదే ద్రవ్యోల్బణం 4.2 శాతంగా నమోదైంది.

దేశవ్యాప్తంగా చూస్తే, ఏప్రిల్ నెలలో సీపీఐ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరింది. ఇది గత 13 నెలల్లోనే అత్యధిక స్థాయిగా నమోదైంది. ముఖ్యంగా గత ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం వరుసగా పెరుగుతుండటం ఆర్థిక నిపుణుల్లో ఆందోళన కలిగిస్తోంది. మార్చి నెలలో 3.40 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం, కేవలం ఒక నెల వ్యవధిలోనే మరింత పెరగడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది.

నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, వంటనూనెల ధరలు పెరగడం ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి తీవ్రత కారణంగా కూరగాయల ఉత్పత్తి తగ్గడం, రవాణా వ్యయాలు పెరగడం కూడా ధరల పెరుగుదలకు దారితీసినట్లు భావిస్తున్నారు.

తెలంగాణలో పరిస్థితి మరింత తీవ్రమవడానికి పట్టణ ప్రాంతాల్లో జీవన వ్యయం పెరగడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్​ వంటి నగరాల్లో అద్దెలు, రవాణా ఖర్చులు, హోటల్ , సేవల ధరలు పెరగడం ప్రజలపై అదనపు ఒత్తిడిని తీసుకొచ్చింది. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై దీని ప్రభావం ఎక్కువగా పడుతున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పటికీ, తెలంగాణలో ఇది 5 శాతం దాటడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వినియోగ వ్యయం పెరగడం వల్ల కుటుంబాల పొదుపులు తగ్గే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఆర్థిక మార్కెట్ల దృష్టిలో కూడా ద్రవ్యోల్బణం కీలక అంశంగా మారింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు భవిష్యత్తులో వడ్డీ రేట్లపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరల పెరుగుదల కొనసాగితే రుణాలపై వడ్డీ భారం కూడా పెరగవచ్చని భావిస్తున్నారు.

ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వంటి కూరగాయల ధరలు ఇటీవల భారీగా పెరగడం కుటుంబ బడ్జెట్‌ను దెబ్బతీస్తోంది. అలాగే గ్యాస్, విద్యుత్, రవాణా ఖర్చులు కూడా పెరగడం జీవన వ్యయాన్ని మరింత భారంగా మార్చింది.

సరఫరా వ్యవస్థ మెరుగుదల, నిల్వల నిర్వహణ, ధరల నియంత్రణ చర్యలు సమర్థవంతంగా అమలు చేయకపోతే రాబోయే నెలల్లో కూడా ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగవచ్చు. ముఖ్యంగా వర్షాకాల పరిస్థితులు, అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు, వ్యవసాయ ఉత్పత్తుల లభ్యత వంటి అంశాలు ధరల దిశను ప్రభావితం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!