యాపిల్ వేదికపై తెలుగు యువకుడి సత్తా..

Must read

విశాఖ పట్టణంకు చెందిన యువ టెక్ నిపుణుడు మానస్​ మల్లా ప్రపంచస్థాయిలో తెలుగు ప్రతిభను చాటారు. టెక్నాలజీ దిగ్గజం అపిల్​ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026’లో విజేతగా నిలిచి అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో యాపిల్ ఎంపిక చేసిన టాప్-15 ‘ఎలైట్’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయుడిగా మానస్ చరిత్ర సృష్టించారు.

ఈ అరుదైన ఘనతతో మానస్‌కు మరో విశేష అవకాశం కూడా లభించింది. జూన్ 9న అమెరికాలో జరిగే యాపిల్ ప్రపంచస్థాయి డెవలపర్స్ సదస్సు (డబ్ల్యూడబ్ల్యూడీసీ)కు అధికారిక ఆహ్వానం అందుకున్నారు. ఈ సదస్సులో యాపిల్ సీఈవో టిమ్ కుక్‌తో ప్రత్యక్షంగా మాట్లాడే అవకాశం దక్కడం విశేషం. ఇది ప్రపంచవ్యాప్తంగా యువ డెవలపర్లకు అత్యంత ప్రతిష్ఠాత్మక వేదికగా దీనిని భావిస్తారు.

మానస్ సాధించిన విజయానికి కేవలం సాంకేతిక ప్రతిభ మాత్రమే కారణం కాదు. దాని వెనుక ఒక బలమైన మానవీయ భావన, సమాజానికి ఉపయోగపడే లక్ష్యం ఉన్నాయి. ప్రస్తుతం GITAM Deemed Universityలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ చదువుతున్న మానస్, విద్యార్థుల మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ‘స్మైలీక్వెస్ట్’ అనే వినూత్న యాప్‌ను రూపొందించారు.

ఈ యాప్ రూపకల్పన వెనుక ఉన్న సంఘటన హృదయ విదారకంగా నిలిచింది. పోటీ పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేక తన స్నేహితుడు ఒకరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మానస్‌ను తీవ్రంగా కలచివేసింది. విద్యార్థులు మార్కుల ఒత్తిడి, బట్టీ చదువులు, నిరంతర పోటీ కారణంగా ఎదుర్కొంటున్న మానసిక సమస్యలను చూసి ఏదైనా మార్పు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు.

దీంతో విద్యార్థులు ఒత్తిడి లేకుండా నేర్చుకునేలా, ఆనందంతో చదువు కొనసాగించేలా ‘స్మైలీక్వెస్ట్’ యాప్‌ను అభివృద్ధి చేశారు. ఈ యాప్‌లో గేమిఫికేషన్, ఇంటరాక్టివ్ లెర్నింగ్, ప్రోత్సాహక పద్ధతులను ఉపయోగించి చదువును మరింత ఆసక్తికరంగా మార్చే ప్రయత్నం చేశారు. చదువును కేవలం పరీక్షల కోసం కాకుండా, సృజనాత్మక అభ్యాస ప్రక్రియగా మార్చాలన్నది మానస్ ఆలోచనగా తెలుస్తోంది.

మానస్ తన చిన్ననాటి అనుభవాలను కూడా ఈ యాప్ రూపకల్పనలో ఉపయోగించారు. చిన్నప్పుడు అమెరికాలో చూసిన విద్యా విధానం తనపై ప్రభావం చూపిందని ఆయన చెబుతున్నారు. అక్కడి విద్యార్థులు ఒత్తిడి లేకుండా నేర్చుకునే విధానం, సృజనాత్మకతకు ఇచ్చే ప్రాధాన్యం తనకు ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు.

యాపిల్ నిర్వహించే ‘స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్’ ప్రపంచవ్యాప్తంగా యువ డెవలపర్ల ప్రతిభను వెలికితీసే ప్రముఖ పోటీగా గుర్తింపు పొందింది. సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, సమాజానికి ఉపయోగపడే ఆలోచనలు వంటి అంశాల ఆధారంగా విజేతలను ఎంపిక చేస్తారు. అలాంటి వేదికలో భారతదేశం నుంచి ఏకైక ‘ఎలైట్’ విజేతగా నిలవడం మానస్ ప్రతిభకు నిదర్శనంగా మారింది.

మానస్ విజయంపై విశాఖతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. “తెలుగు యువతకు గర్వకారణం”, “విశాఖ ప్రతిభ ప్రపంచానికి తెలిసింది”, “ఇన్నోవేషన్‌కు కొత్త ఉదాహరణ” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ విజయంతో మానస్ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ అవకాశాలు అందుకునే అవకాశముందని టెక్ నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యా రంగంలో సాంకేతిక వినియోగంపై ఆయన చేస్తున్న కృషి మరింత మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!