ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ మంచి రోడ్లతో రాష్ట్రంలోని ప్రతి గ్రామం,ప్రతి మండలం, ప్రతి పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. రహదారుల అభివృద్ధి వల్ల పరిశ్రమలు ఏర్పడి మౌలిక వసతులు పెరుగుతాయని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం టెండర్ ప్రక్రియ వివరాలపై అధికారులను మంత్రి ఆరా తీశారు.
హ్యామ్ (HAM) ప్రాజెక్టుల పురోగతిపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోమవారం అధికారులతో మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో చేపడుతున్న హ్యామ్ రోడ్ల ప్రాజెక్టుల పురోగతి, పనుల నాణ్యత, నిర్మాణ వేగం, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై అధికారులతో మంత్రి సమగ్రంగా చర్చించారు.
కేంద్ర రహదారుల రవాణా మంత్రిత్వ శాఖ (MoRTH) ప్రవేశపెట్టిన హ్యామ్ విధానాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) 2016 నుంచి దేశవ్యాప్తంగా విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇప్పటివరకు 374కు పైగా ప్రాజెక్టులను రూ.4 నుండి 5 లక్షల కోట్ల పెట్టుబడులతో చేపట్టినట్లు వెల్లడించారు. జాతీయ స్థాయిలో విజయవంతమైన ఈ విధానాన్ని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్నాయని, అదే నమూనాలో తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్ర రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
ఎక్సెస్ టెండర్లు అంటూ వస్తున్న ఆరోపణలపై మంత్రి అధికారులను అడిగారు. హ్యామ్ అమలు చేసిన మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, బీహార్ వంటి రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణలోనే ఎక్సెస్ తక్కువగా ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అవి అసత్య ప్రచారాలు అని గణాంకాలతో సహా మంత్రికి వివరించారు.
HAM ఫేజ్-1 కింద రోడ్లు, భవనాల శాఖ ద్వారా రూ.13,006.27 కోట్ల వ్యయంతో 441 రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఇవి మొత్తం 6,092.37 కిలోమీటర్ల పొడవుతో 34 ప్యాకేజీలుగా అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. అలాగే పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ.6,250 కోట్లతో 2,162 రహదారుల నిర్మాణ పనులు 7,450 కిలోమీటర్ల పొడవుతో 17 ప్యాకేజీల రూపంలో కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల అమలుకు ముందు టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీస్ నిర్వహించి, NHAI నమూనాలోనే RFP మరియు DCA డాక్యుమెంట్లు రూపొందించి పారదర్శకంగా టెండర్లు ఆహ్వానించినట్లు అధికారులు వివరించారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడేలా, పరిశ్రమల విస్తరణకు అనుకూలంగా, ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అందించేలా నాణ్యమైన రహదారి మౌలిక వసతుల అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే ఈ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మంగళవారం లేదా బుధవారం కలుస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్ బి.వి రావు,పలువురు ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.





