తమిళనాడు ప్రొటెం స్పీకర్‌గా నియామకం కరుప్పయ్య

Must read

తమిళనాడు రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విజయ్​ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తమిళనాడు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా టీవీకే ఎమ్మెల్యే ఎం.వి. కరుప్పయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం కొత్తగా ఎన్నికైన తమిళనాడు అసెంబ్లీ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ నియామకం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.

చోళవందాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన కరుప్పయ్యకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం టీవీకే ప్రభుత్వంలో విశేష చర్చకు దారితీసింది. ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు, సభ తొలి సమావేశాలను పర్యవేక్షించనున్నారు. కొత్త స్పీకర్ ఎన్నిక జరిగే వరకు సభా కార్యకలాపాలను నిర్వహించే బాధ్యతలు కూడా ఆయనపై ఉంటాయి.

ఎం.వి. కరుప్పయ్య రాజకీయ ప్రస్థానం తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగింది. గతంలో ఆయన అన్నాడీఎంకేలో కీలక నేతగా పనిచేశారు. అయితే కాలక్రమేణా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందని భావించిన ఆయన, ఈ ఏడాది ప్రారంభంలో విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, ఎన్నికల సమయంలో టీవీకే విజయానికి కృషి చేశారు.

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అద్భుత విజయాన్ని సాధించింది. మొత్తం 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. దశాబ్దాలుగా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలుకుతూ టీవీకే కొత్త రాజకీయ శకానికి నాంది పలికింది. కాంగ్రెస్, వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్ పార్టీల మద్దతుతో విజయ్ ప్రభుత్వం ఏర్పడింది.

ఆదివారం చెన్నైలోని జవహర్​ లాల్​ నెహ్రు ఇండోర్​ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్​.ఎన్​. రవి స్థానంలో పేర్కొన్న గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, విజయ్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో తొమ్మిది మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. సినీ రంగంలో అపారమైన ప్రజాదరణ సంపాదించిన విజయ్ రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ప్రభావం చూపడం విశేషంగా మారింది.

సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ కీలక నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టిన ఆయన, తొలి రోజే మూడు ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. ఇందులో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు, మహిళల భద్రత కోసం “సింగా పెన్” ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల సమస్యను అరికట్టేందుకు ప్రత్యేక యాంటీ డ్రగ్ విభాగం ఏర్పాటు వంటి అంశాలు ఉన్నాయి.

ఈ నిర్ణయాలతో టీవీకే ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందనే భావన ప్రజల్లో పెరుగుతోందని అంటున్నారు. ముఖ్యంగా యువత, మహిళలు, మధ్యతరగతి వర్గాల్లో టీవీకే ప్రభుత్వంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రొటెం స్పీకర్‌గా కరుప్పయ్య నియామకం కూడా రాజకీయంగా వ్యూహాత్మక నిర్ణయంగా విశ్లేషిస్తున్నారు. అనుభవజ్ఞుడైన నేతకు ఈ బాధ్యతలు అప్పగించడం ద్వారా అసెంబ్లీ ప్రారంభ సమావేశాలు సజావుగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే అన్నాడీఎంకే నుంచి వచ్చిన నాయకులకు కూడా టీవీకేలో ప్రాధాన్యత లభిస్తోందనే సంకేతం ఈ నిర్ణయం ద్వారా వెళ్లిందని రాజకీయ వర్గాలు చర్చిస్తున్నాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!