నమ్మకంగా ఉండండి, మంచే జరుగుతుంది.. విజయ్​ బాడీగార్డ్

Must read

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలన్న ఆశలకు చివరి నిమిషంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో శనివారం జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అనిశ్చితిలో పడిపోయింది. దీంతో తమిళ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ఈ నేపథ్యంలో విజయ్ బాడీగార్డ్ ఆరూన్ సురేశ్ పెట్టిన ఓ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది. “కఠినమైన పోరాటాల తర్వాతే అందమైన ఫలితాలు వస్తాయి” అని ఆయన పేర్కొన్నారు. అలాగే, “నమ్మకంగా ఉండండి, మంచే జరుగుతుంది” అని తమిళంలో రాసుకొచ్చారు. విజయ్ పేరును ప్రస్తావించనప్పటికీ, ప్రస్తుత క్లిష్ట సమయంలో ఆయనకు ధైర్యం చెప్పేందుకే ఈ పోస్ట్ పెట్టారని నెటిజన్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, కమల హాసన్, ఖుష్బూ సుందర్, విశాల్ వంటి పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు మద్దతు తెలుపుతున్నారు.

తాజా అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే సంచలన ఫలితాలు నమోదు చేసింది. దశాబ్దాలుగా తమిళ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు గట్టి సవాల్ విసురుతూ విజయ్ పార్టీ భారీ స్థాయిలో సీట్లు గెలుచుకుంది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో టీవీకే 108 స్థానాల్లో విజయం సాధించింది. ప్రజల్లో విజయ్‌కు పెరుగుతున్న ఆదరణకు ఈ ఫలితాలు నిదర్శనంగా నిలిచాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 5 మంది ఎమ్మెల్యేలు, సీపీఐకి చెందిన 2 మంది, సీపీఎంకు చెందిన 2 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కు మద్దతు ప్రకటించారు. దీంతో టీవీకే బలం 117కు చేరువైనప్పటికీ, ఇంకా స్పష్టమైన మెజారిటీపై సందేహాలు కొనసాగాయి.

ఈ సమయంలో డీఎంకే కూటమిలో భాగస్వామ్య పార్టీలైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్), (వీసీకే) కీలక ప్రకటనలు చేశాయి. టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశాయి. ఈ ప్రకటనతో తమిళ రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. విజయ్ శిబిరంలో ఆందోళన నెలకొనగా, ప్రత్యర్థి పార్టీల్లో ఉత్సాహం కనిపించింది.

ఇప్పటికే విజయ్ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. చెన్నైలోని లోక్‌భవన్‌కు వెళ్లిన ఆయన, తాను అతిపెద్ద పార్టీ నేతనని, ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అయితే గవర్నర్ కార్యాలయం మాత్రం సంఖ్యాబలంపై పూర్తి స్పష్టత కోరినట్లు తెలుస్తోంది. మద్దతు లేఖలు, ఎమ్మెల్యేల సంఖ్యపై నిర్ధారణ లేకపోవడంతో వెంటనే నిర్ణయం తీసుకోలేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

దీంతో శనివారం జరగాల్సిన ప్రమాణ స్వీకార కార్యక్రమం వాయిదా పడినట్లు సమాచారం. ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమైనప్పటికీ, తాజా రాజకీయ పరిణామాలతో అవన్నీ నిలిచిపోయాయి. టీవీకే కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరోవైపు డీఎంకే శ్రేణులు మాత్రం ఈ పరిణామాలను ఆసక్తిగా గమనిస్తున్నాయి.

తమిళనాడు రాజకీయాల్లో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. టీవీకే మరిన్ని పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుందా? లేక ప్రత్యర్థి కూటములు కొత్త వ్యూహాలతో ముందుకు వస్తాయా? అన్న చర్చ కొనసాగుతోంది. గవర్నర్ తదుపరి నిర్ణయం కూడా ఇప్పుడు కీలకంగా మారింది.

ప్రస్తుతం టీవీకే ముఖ్య నేతలు వరుస సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఇతర చిన్న పార్టీల మద్దతు కోసం సంప్రదింపులు కొనసాగుతున్నట్లు సమాచారం. మరోవైపు ప్రత్యర్థి పార్టీలు కూడా తమ రాజకీయ వ్యూహాలను పదును పెడుతున్నాయి.

- Advertisement -spot_imgspot_imgspot_imgspot_img

More articles

- Advertisement -spot_imgspot_imgspot_img

Latest article

error: Content is protected !!